విజయవాడలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించగా.. విజయవాడలో ఇంద్రకీలాద్రిపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దేవస్థానానికి చెందిన సమాచార కేంద్రం ధ్వంసమైంది. పెద్ద బండరాళ్లు, ఒక్కసారిగా జారిపడడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
విజయవాడ మొగల్రాజపురం సున్నపుబట్టి సెంటర్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారిని మేఘన, అన్నపూర్ణ, లక్ష్మిగా గుర్తించారు. మరో వ్యక్తి పేరు తెలియరాలేదు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొండచరియలు విరిగి పడిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలో గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడగా, పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.