తండ్రిది ఒక మాట.. తనయుడిది ఇంకో మాట.. ఏమిటిది ఇళయదళపతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Nov 2020 8:17 PM IST
తండ్రిది ఒక మాట.. తనయుడిది ఇంకో మాట.. ఏమిటిది ఇళయదళపతి..!

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు చూసినా ఎంతో ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా సినిమాలకు తమిళనాడు పాలిటిక్స్ కు మధ్య ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎన్నో ప్రముఖ పార్టీలు ఉన్నా.. ఇంకా కొన్ని పార్టీలు రాబోయే ఎన్నికల్లో సందడి చేసే అవకాశమే ఎక్కువగా ఉంది. రజనీకాంత్ ఇప్పటికే పెద్ద ఎత్తున దూసుకుని వెళ్లాలని అనుకుంటూ ఉండగా.. ఇళయదళపతి విజయ్ కు చెందిన పార్టీ కూడా రాబోతోందనే ప్రచారం భారీగా జరుగుతోంది.

విజయ్‌ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ‘‘ఆలిండియా దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయాక్కం’’పేరిట పొలిటికల్‌ పార్టీని రిజిస్టర్ చేయడంతో.. విజయ్ తమిళనాడు శాసించబోయే సమయం వచ్చిందని అభిమానులు భావించారు. ఇలా జరిగిన కొన్ని గంటల్లోనే తనకు రాజకీయాలతో సంబంధం లేదంటూ విజయ్ తేల్చేశాడు. పీఆర్‌ఓ రియాజ్‌ అహ్మద్ షేర్‌ చేసిన లేఖలో ‘‘మా నాన్న ఎస్‌ఏ చంద్రశేఖర్‌ ఈరోజు రాజకీయ పార్టీ ప్రారంభించారని మీడియా ద్వారా నాకు తెలిసింది. ఆ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. దీని వల్ల నా అభిమానులకు, ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నా." అంటూ సంచలన ప్రకటన ఇచ్చేశాడు.

మా నాన్న స్థాపించారన్న కారణంగా, ఈ పార్టీలో చేరమని గానీ, పార్టీ కోసం పనిచేయమని గానీ నేను చెప్పదలచుకోలేదు. మనం మొదలుపెట్టిన సేవా కార్యక్రమాల ఉద్యమానికి, పార్టీకి అసలు ఎలాంటి సంబంధం ఉండదని అన్నాడు. అంతేకాదు విజయ్‌ మక్కల్‌ ఇయాక్కం పేరిట స్థాపించిన పార్టీ కార్యకలాపాల్లో నా పేరుగానీ, ఫొటోగానీ వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకునేందుకు ఏమాత్రం వెనకడుగు వేయబోనని అందులో ఉంది.

ఇక చేసేదేమీ లేక విజయ్ తండ్రి ఈ పార్టీకి విజయ్ కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేశాడు. ఈ పార్టీ స్థాపన అనేది తన వ్యక్తిగత నిర్ణయమని చంద్రశేఖర్‌ ఓ ప్రకటన ద్వారా చెప్పేశాడు. ఇక తండ్రీకొడుకుల మధ్య విభేదాలు తలెత్తాయంటూ జోరుగా ప్రచారం జరగ్గా తమ మధ్య ఎలాంటి పొరపొచ్చాలు లేవని, అంతాబాగానే ఉందని వివరణ ఇచ్చాడు.

Next Story