తగ్గినోడే.. నెగ్గినోడు..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 16 July 2020 4:21 PM ISTసమయ సందర్భాలను బట్టి వ్యవహరించేవారే చాలా కాలం వృత్తిలో కొనసాగ గలుగుతారు. ఇది అక్షరసత్యమని నిరూపించారు కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్. సినిమా అంటేనే 24 ఫ్రేముల సమాహారం. వేలాది మంది శ్రమిస్తే రెండు గంటల సినిమా తెరపై ప్రేక్షకులను అలరిస్తుంది. ఏ ఒక్క ఫ్రేములో లోపం ఉన్నా అది సినిమాలో స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. సినిమా భారీ వాణిజ్య పరిశ్రమ. నిర్మాత డబ్బులు కుమ్మరించనిదే ఏ పనీ జరగదు.
అయితే కరోనా విలయంతో సమాజంలో అన్ని వ్యవస్థల్లాగానే సినిమా రంగం కుదేలైంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలేవీ రావట్లేదు. ఇప్పటికే తీసిన సినిమాలు విడుదలకు కూడా నోచుకోవట్లేదు. గత్యంతరం లేక ఓపిక నశించిన నిర్మాతలు ఓటీటీని ఆశ్రయించి తక్కువ నష్టాలతో బైటపడుతున్నారు. ఈ విపత్కాల పరిస్థితిలో సినిమా తీయాలనుకోవడమే పెద్ద సాహసం. గతంలో సినిమా బడ్జెట్లో దాదాపు సగం హీరో హీరోయిన్ల పారితోషికానికే సరిపోయేది. పాపులర్ కమర్షియల్ హీరోలైతే పారితోషికం కోట్లలోనే ఉంటుంది. ప్రస్తుతం పరిస్థితి బాగాలేనందున సినిమా తీయడమే గొప్పగా మారింది. ఈ నేపథ్యంలో ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ తన పారితోషికాన్ని తగ్గించుకుని నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
సర్కార్, భైరవ లాంటి ప్రముఖ చిత్రాల్లో హీరోగా నటించిన విజయ్ తన పారితోషికాన్ని కాస్త తగ్గించుకుంటూ నిర్మాతలకు బాసటగా ఉంటున్నాడు. అలాగే చియాన్ విక్రమ్ తో 'కోబ్రా' చిత్రం నిర్మిస్తున్న యువదర్శకుడు జ్ఞానముత్తు తన పారితోషికంలో ఏకంగా 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించి సినీ పరిశ్రమలో పలువురి దృష్టి ఆకర్షించాడు. విజయ్ కోలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో. మురుగదాస్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఓ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తనకిచ్చే పారితోషికంలో 20 శాతం తగ్గించుకుంటున్నట్లు ప్రకటించి తన హీరోయిజం చూపించాడు. ఈ దారిలోనే దర్శకుడు మురగదాస్ కూడా తన పారితోషికాన్ని తగ్గించుకుంటున్నట్లు తెలిపారు.
విజయ్, మురగదాస్ ల కాంబినేషన్‌లో తుపాకీ, కత్తి, సర్కార్ సినిమాలు వచ్చిన నేపథ్యంలో మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న కొత్త సినిమాపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు చక్కబడ్డాక సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. కాగా తను హీరోగా నటించిన మాస్టర్ సినిమా విడుదల కోసం విజయ్ ఎదురు చూస్తున్నాడు. కోలీవుడ్ హీరోలు డైరెక్టర్ల లాగే తెలుగు ఇతర సినిమా ఇండస్ట్రీ హీరోలు డైరెక్టర్లు ఆలోచిస్తే ఎంత బావుంటుందో కదా!!