కిచ్చ సుదీప్ మొదలెట్టాడు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 July 2020 10:36 AM GMT
కిచ్చ సుదీప్ మొదలెట్టాడు..

కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వడం లేదు. ఇప్పటికే షూటింగ్ లకు వెళ్లిన పలువురు నటీనటులకు కరోనా సోకడంతో షూటింగ్ షెడ్యూల్ ఇంకొన్ని నెలలు పోస్ట్ పోన్ చేసుకోవాలని స్టార్ హీరోలంతా భావిస్తున్నారు. సీరియల్స్, చిన్న చిన్న సినిమాల షూటింగ్ లు మొదలయ్యాయి. వారు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కూడా కరోనా పాజిటివ్ కేసులు రావడం పలువురిని కలవరపెడుతోంది. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ తన సినిమాను మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో సుదీప్ 'ఫాంటమ్' సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాడు.

చాలా తక్కువ మంది సిబ్బందితో ఫాంటమ్ షూటింగ్ ను హైదరాబాద్ లో మొదలుపెట్టామని సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రభుత్వం చెప్పిన సూచనలు కూడా పాటిస్తూ ఉన్నామని తెలిపారు. షూటింగ్ సజావుగా సాగాలని కోరుకుంటున్నామన్నారు. చిత్ర యూనిట్ ఈరోజు పూజ చేసింది. షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేశారు.



మరో ట్వీట్ లో చిత్ర బృందంలోని ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ సభ్యులందరూ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందినవారేనని అన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన వారికి ఉపాధి కల్పించామని క్లారిటీ ఇచ్చారు సుదీప్.

చిత్ర బృందం అన్నపూర్ణ స్టూడియోస్ లో పెద్ద సెట్ ను ఏర్పాటు చేసింది. చిత్ర యూనిట్ బృందంతో పాటు డాక్టర్, నర్స్ కూడా షూటింగ్ లొకేషన్ లో ఉన్నారు. ఈ సినిమాకు అనూప్ బండారి దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. సినిమాటోగ్రఫీ విలియమ్ డేవిడ్ అందిస్తూ ఉండగా.. అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు.

Next Story