Fact Check : నిరుద్యోగ యువత రోడ్డు మీదకు వచ్చి.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ను అడ్డుకున్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sept 2020 8:16 PM IST
Fact Check : నిరుద్యోగ యువత రోడ్డు మీదకు వచ్చి.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ను అడ్డుకున్నారా..?

భారతదేశంలో నిరుద్యోగ సమస్య యువతను పట్టి పీడిస్తోంది. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా కూడా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి నెలకొంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ కు చెందిన నిరుద్యోగ యువత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్వాయ్ ను అడ్డుకుందంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ లక్నోలో వెళుతూ ఉండగా.. నిరుద్యోగులు రోడ్డు మీదకు వచ్చి కాన్వాయ్ ను అడ్డుకోవాలని చూశారు.

నలుపు రంగు జెండాలను చేతిలో పట్టుకుని నినాదాలు చేస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది వారిని పక్కకు లాగేశారు. నిరసన తెలియజేసిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.

ఇదే విషయాన్ని చెబుతూ వందల మంది సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియోను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

వీడియోను బాగా గమనిస్తే.. అందులో ఉన్న ఏ ఒక్కరు కూడా మాస్కును ధరించలేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మాస్కులను తప్పకుండా ధరించాల్సిందే. దీన్ని బట్టి ఈ వీడియో ఇప్పటిది కాదని.. చాలా పాతదని అర్థమవుతుంది.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ వీడియో ABP News మీడియా సంస్థ తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్టు చేసింది. 2017 సంవత్సరంలో ఈ వీడియోను అప్లోడ్ చేశారు.

The Times of India జూన్ 27, 2017న వచ్చిన కథనం ప్రకారం ఈ వీడియోలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్ ను అడ్డుకున్న విద్యార్థులు 20 రోజుల పాటూ జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. విద్యార్థులు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్, స్టూడెంట్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సమాజ్ వాదీ ఛాత్ర సభ గ్రూపులకు చెందిన విద్యార్థులు.

The Indian Express లో కూడా ఈ విషయాన్నే ప్రస్తావించారు.

యూపీ ముఖ్యమంత్రి కాన్వాయ్ ను విద్యార్థులు అడ్డుకున్న ఘటన ఇటీవల చోటు చేసుకుంది కాదు. 2017లో జరిగిన ఘటన. వైరల్ అవుతున్న పోస్టుల్లో 'నిజం లేదు'.

Next Story