Fact Check : దావూద్ ఇబ్రహీం అమితాబ్ బచ్చన్ తో ఆలింగనం చేశారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Sep 2020 6:14 AM GMT
Fact Check : దావూద్ ఇబ్రహీం అమితాబ్ బచ్చన్ తో ఆలింగనం చేశారా..?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ వ్యక్తిని ఆలింగనం చేస్తూ ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన దావూద్ ఇబ్రహీం అన్న ప్రచారం జరుగుతోంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుతో అమితాబ్ బచ్చన్ కు ఏమి పని అంటూ పలువురు ఈ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఉన్నారు.

ఓ ఫేస్ బుక్ యూజర్ ఈ ఫోటోను పోస్టు చేశాడు. హిందీలో ఆ ఫోటో గురించి రాసుకుని వచ్చాడు. 'అమితాబ్ బచ్చన్ దావూద్ ఇబ్రహీంతో కలిసి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఇటీవల జయా బచ్చన్ డ్రగ్స్ గురించి చేసిన వ్యాఖ్యల ఫలితంగా ఈ ఫోటోను బయటకు తీసుకుని వచ్చారు. అమితాబ్ మిమ్మల్ని చూస్తూ ఉంటే.. సిగ్గేస్తోంది' అని అందులో ఉంది.

जाने, गद्दार पिग बी की बीबी क्यों बौखलाई ?

रिश्ते में तो हम तुम्हारे बाप होते हैं, पर मैं आपका गुलाम हूँ..! दाऊद...

Posted by Krish Mohan on Wednesday, 16 September 2020

ముంబై పోలీసులు అమితాబ్ బచ్చన్ ఇంటి వద్ద సెక్యూరిటీని ఇటీవలే పెంచారు. అమితాబ్ బచ్చన్ బంగ్లా జల్సా చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం డ్రగ్స్ తీసుకోవడం లేదని.. మొత్తం చిత్ర పరిశ్రమకు డ్రగ్స్ ఆపాదించడం తప్పు అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది ఎంపీ జయా బచ్చన్. దీంతో కంగనా రనౌత్ మద్దతుదారులు జయా బచ్చన్ మీద, జయా బచ్చన్ కుటుంబం మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు 'పచ్చి అబద్ధం'.

అమితాబ్ బచ్చన్ తో పాటూ ఉన్న వ్యక్తి మరెవరో కాదు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ చవాన్. ముంబైలో ఓ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా 2010లో ఈ ఫోటోను తీశారు.

ఈ ఫోటోను న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ ససెర్చ్ చేయగా.. The Times of India మార్చి 25, 2010న ఈ ఫోటోను పబ్లిష్ చేసింది. రాజీవ్ గాంధీ సీలింక్ ప్రారంభోత్సవం సందర్భంగా అమితాబ్ బచ్చన్, అశోక్ చవాన్ కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు తీసిన ఫోటో ఇదని చెబుతూ ఉన్నారు. అంతేకానీ ఆ ఫోటోలో ఉన్నది దావూద్ ఇబ్రహీం కాదు.

అమితాబ్ బచ్చన్ దావూద్ ను ఆలింగనం చేసుకున్నాడంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. ఆ ఫోటోలో ఉన్నది ప్రముఖ రాజకీయ నాయకుడు 'అశోక్ చవాన్'.

Next Story