Fact Check : కసబ్ కు జైల్లో బిరియానీ పెట్టించారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Sep 2020 2:42 PM GMT
Fact Check : కసబ్ కు జైల్లో బిరియానీ పెట్టించారా..?

ఇటీవల ముంబైలో నటి కంగనా రనౌత్ కు సంబంధించిన ఆఫీసును కూల్చి వేశారు ముంబై మున్సిపాలిటీకి చెందిన అధికారులు. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. పలు మీడియా సంస్థలు దీనిపై డిబేట్ లను కూడా నిర్వహించాయి.

ఆజ్ తక్ టీవీ ఛానల్ లో కూడా ఈ విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. 'దంగల్' అనే ప్రైమ్ టైమ్ షోలో పెద్ద ఎత్తున పలు విషయాలపై వాడీ వేడీ చర్చలు జరిపారు.

ఈ చర్చా కార్యక్రమానికి హాజరైన ప్యానలిస్ట్ అయిన రవి శ్రీవాత్సవ కంగనా రనౌత్ కు వై కేటగిరీ భద్రతను కల్పించడంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ట్యాక్స్ కడుతున్న వారి డబ్బులతో కంగనా రనౌత్ కు భద్రత కల్పిస్తూ ఉన్నారని ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు.

అదే షోలో బీజేపీ నేత సంబిత్ పాత్రా మాట్లాడుతూ జైలులో ఉన్న అజ్మల్ కసబ్ కు బిరియానీ పెట్టారు అంటూ ఆరోపించారు. డిబేట్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. 'బెదిరింపులు ఎదుర్కొంటున్న మహిళకు సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పేముందని.. తీవ్రవాది కసబ్ కు కూడా బిరియానీని ట్యాక్స్ కడుతున్న వారి డబ్బులతోనే పెట్టారు కదా' అని ప్రశ్నించారు.



నిజ నిర్ధారణ:

కసబ్ కు జైలులో బిరియానీ పెట్టారన్నదాన్లో ఎటువంటి నిజం లేదు.

The Times of India రిపోర్టు ప్రకారం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ మాట్లాడుతూ కసబ్ ను విచారించే సమయంలో ఎప్పుడు కూడా బిరియానీ పెట్టలేదు అని చెప్పారు.

నిఖమ్ మాట్లాడుతూ 'కసబ్ ఎప్పుడు కూడా బిరియానీ అడగలేదు.. ప్రభుత్వం కూడా కసబ్ కు బిరియానీ పెట్టలేదు.. కసబ్ కు సంబంధించిన ఏ విషయమైనా ఎమోషనల్ గా చూపిస్తూ ఉండేవారు.. చిన్న విషయం కూడా భూతద్దంలో చూపించేవారు' అని అన్నారు.

మీడియా కసబ్ కు చెందిన ప్రతి అంశాన్ని బాగా గమనిస్తూ ఉండేది. అతడి బాడీ లాంగ్వేజ్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టేది. ఒకరోజు కోర్టు రూమ్ లో అతడు తల దించుకుని కళ్ళను తుడుచుకున్నాడు. అంతే కొన్ని నిమిషాల్లోనే మీడియాలో 'కసబ్ కంట కన్నీరు' అంటూ వార్తలు వచ్చాయి. ఆరోజు రక్షా బంధన్ కావడంతో మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఈ అంశంపై డిబేట్లు పెట్టారు. కొందరైతే కసబ్ కు తన సోదరి గుర్తుకు రావడంతో కన్నీరు పెట్టుకున్నాడంటూ చెప్పుకొచ్చారు. ఇంకొందరేమో అసలు కసబ్ తీవ్రవాది కాదంటూ వాదించారని నిఖమ్ తెలిపాడు.

ఇలాంటి ఎమోషనల్ వేవ్, వాతావరణం ఇప్పటికైనా ఆపాలి. అందుకే ఆరోజు నేను మీడియాతో మాట్లాడుతూ కసబ్ జైలులో మటన్ బిరియానీ కావాలని అడిగాడంటూ కావాలనే చెప్పానని నిఖమ్ చెప్పుకొచ్చాడు. అంతేకానీ ఏ రోజు కూడా కసబ్ బిరియానీ కావాలని అడగలేదు.. ప్రభుత్వం కూడా అతడికి బిరియానీ పెట్టలేదు అని తెలిపారు.

Economic times కూడా ఈ విషయాన్నే వెల్లడించింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లుగా, అప్పట్లో కసబ్ బిరియానీ కావాలని అడిగినట్లుగా వచ్చిన వార్తల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Next Story