Fact Check : చైనాలో కార్లు కొట్టుకుని పోయే స్థాయిలో వరదలు వచ్చాయా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Aug 2020 5:33 PM ISTచైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కు పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరుతోంది. యాంగ్ట్జే నదిలో వరద నీరు భారీగా పారుతూ ఉండడంతో చాలా వరకూ డ్యామ్ నిండిపోయిందని చెబుతూ ఉన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద నీరు పెద్ద ఎత్తున త్రీ గోర్జెస్ డ్యామ్ వద్దకు వరద నీరు చేరుతోంది. యాంగ్ట్జే నది ఉగ్రరూపం దాల్చడం కారణంగా జులై నెలలో సౌత్ ఈస్ట్రన్ చైనాలోని చాలా ప్రాంతాలు వరద నీరు కారణంగా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం చైనాలో వరదలు భారీ స్థాయిలో వస్తున్నాయంటూ పలువురు వీడియోలు పోస్టు చేస్తూ ఉన్నారు. కొన్ని నిమిషాల్లోనే నగరం మొత్తం తుడిచిపెట్టుకుని వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. మూడు బ్రిడ్జిలు యాంగ్ట్జే నది ఉగ్రరూపం దాల్చడం వలన కూలిపోయాయని చెబుతూ పలువురు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. రోడ్ల మీద ఉన్న కార్లు కూడా కొట్టుకుపోయాయి.. క్షణాల్లో ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోవడం గమనించవచ్చు.
ఈ వీడియోకు సంబంధించిన నిజా నిజాలు తెలియజేయాలంటూ న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ చేయడం జరిగింది.
నిజ నిర్ధారణ:
వరదనీరు కారణంగా ఇలాంటి ఘటన చోటుచేసుకుందని చెబుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో 2011లో జపాన్ లో వచ్చిన సునామీకి సంబంధించిన వీడియో.
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకొని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇది 2011లో జపాన్ లో వచ్చిన సునామీకి సంబంధించిన వీడియోగా స్పష్టమైంది. పలు యూట్యూబ్ ఛానల్స్ లో ఈ వీడియోను పోస్టు చేశారు.
అప్పటి నుండి ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది.
మార్చి 11, 2011న రిక్టర్ స్కేల్ మీద 9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో ఈశాన్య జపాన్ లో సునామీ సంభవించింది. ఈ భూకంపం ప్రపంచం లోని పలు దేశాల్లో తీవ్ర ప్రభావం చూపింది. నార్వే నుండి అంటార్కిటికా వరకూ ప్రభావం చూపిందని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఇక చైనా లోని యాంగ్ట్జే నది మీద ఉన్న త్రీ గోర్జెస్ డ్యామ్ కూలిపోయిందన్న వార్తలో కూడా నిజం లేదు. ఈ ఏడాది అయిదు సార్లు యాంగ్ట్జే నదిలో వరదలు వచ్చినప్పటికీ త్రీ గోర్జెస్ డ్యామ్ కు ఏమీ అవ్వలేదని తెలిపారు. రిజర్వాయర్ లో నీటి మట్టం హై లెవెల్ లో ఉందని చైనాకు చెందిన అధికారులు తెలిపారు.
వరదల కారణంగా ప్రజలను ఎమెర్జెన్సీగా చాలా ప్రాంతాల నుండి తరలించారు. 251000 మందికి పైగా లోతట్టు ప్రాంతాల నుండి తరలించారు.
చైనాలో వరదలకు సంబంధించిన వీడియోను ఇక్కడ చూడొచ్చు.
The Atlantic వెబ్సైట్ ఆగష్టు 25, 2020న చైనాలో వరదలకు సంబంధించిన ఫోటోలను పబ్లిష్ చేసింది.
చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కూలిపోయిందన్న దాన్లో ఎటువంటి నిజం లేదని Logical Indian తేల్చింది.
త్రీ గోర్జెస్ డ్యామ్ కూలిపోయిందన్న దాన్లో ఎటువంటి నిజం లేదు. చైనాలో వరదలంటూ వైరల్ అవుతున్న వీడియో 2011 లో జపాన్ లో వచ్చిన సునామీకి సంబంధించిన వీడియో.
వైరల్ అవుతున్న పోస్టులు 'అబద్ధం'