సుగాలి ప్రీతి.. 2017 ఆగస్టు 19న 14 ఏళ్ల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. కర్నూలు శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్‌.రాజు నాయక్, ఎస్‌.పార్వతిదేవి దంపతుల కుమార్తె. ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెబుతోంది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్‌ యజమాని కొడుకులు బలవంతంగా రేప్‌ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఉన్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన వైద్యులు 2017 ఆగస్టు 20న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో బాలికని రేప్‌ చేసినట్లు నిర్ధారించారు. తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్‌లో కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్‌ యజమానితో పాటు.. అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసినప్పటికీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. తమ బిడ్డను రేప్‌ చేసి చంపిన వారిని శిక్షించాలంటూ బాలిక తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. పలువురు రాజకీయనాయకులను కూడా ఆమె తల్లిదండ్రులు కలవడం జరిగింది.

సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ఆదివారం నాడు ట్విట్టర్ యూజర్ సుగాలి ప్రీతి విషయంలో కర్నూలు ఎస్పీ ఓ లెటర్ ను రాశారంటూ పోస్టును పెట్టారు కొందరు.

“Finally, A Response From Kurnool SP On SugaliPreethi Case.Tq to all who participated in this Trend
జై హింద్. #JusticeForSugaliPreethi” అంటూ పోస్టు పెట్టారు.

నిజ నిర్ధారణ:

సుగాలి ప్రీతి విషయంలో కర్నూలు ఎస్పీ రిపోర్టు పెట్టారన్నది ‘అబద్ధం’

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు గురించి మరో వ్యక్తి స్పందించాడు. బ్రదర్ మీరు పోస్టు చేసినది ఫేక్ లెటర్ గా ఉంది. acknowledgement అన్న స్పెల్లింగ్ లో తప్పు ఉంది. ట్రెండ్ ను తప్పుద్రోవ పట్టించడానికి ఈ లెటర్ ను బయటకు తీసుకుని వచ్చారని అందులో చెప్పుకొచ్చారు.

#JusticeForSugaliPreethi అనే ట్రెండ్ ను ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.

ఈ విషయంపై న్యూస్ మీటర్ కర్నూల్ పోలీసు స్టేషన్ ను సంప్రదించగా ఆ వైరల్ పోస్టు నిజం కాదని స్పష్టం చేశారు.

సుగాలి ప్రీతి కేసుపై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రత్యేక దృష్టి పెట్టారనే కథనాలు తెలుగు మీడియాలో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో సుగాలి ప్రీతి కుటుంబసభ్యులతో సవాంగ్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  సీబీఐకి కేసు అప్పగించడంలో జాప్యానికి గల కారణాలను లా అండ్‌ ఆర్డర్‌ ఏడీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ డీజీపీకి తెలిపారు. కేసు విషయంలో సుగాలి ప్రీతి తల్లి అనుమానాలను రవిశంకర్‌ నివృత్తి చేశారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. డీవోపీటీ నుంచి అనుమతి రాగానే సీబీఐ కేసు విచారణ మొదలుపెడుతుందని అన్నారు.

సుగాలి ప్రీతి విషయంలో కర్నూల్ ఎస్పీ లెటర్ ను విడుదల చేశారన్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *