Fact Check : వికారాబాద్ మహిళ కిడ్నాప్ దృశ్యాలంటూ వైరల్ అవుతున్న వీడియో..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Sep 2020 6:03 AM GMT
Fact Check : వికారాబాద్ మహిళ కిడ్నాప్ దృశ్యాలంటూ వైరల్ అవుతున్న వీడియో..!

తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ లో షాపింగ్ కు అంటూ వెళ్లిన ఓ మహిళ కిడ్నాప్ కు గురైన సంగతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అవుతోంది. దీపిక అనే మహిళను ఆమె భర్త అఖిల్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు.

ఇంతలో ఒక సీసీటీవీ ఫుటేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు నడుచుకుంటూ వెళుతూ ఉండగా.. కారులో వచ్చిన కొందరు దుండగులు ఓ మహిళను కారులోకి తీసుకుని వెళ్లిపోయారు. ఈ వీడియో ఎన్నో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. యూట్యూబ్ లో కూడా పోస్టు చేశారు. వైరల్ అవుతున్న పోస్టులో ఉన్న మహిళ దీపిక అంటూ పలువురు పోస్టులు చేస్తూ ఉన్నారు.

పలు తెలుగు మీడియా ఛానల్స్ లో కూడా ఈ వీడియోను పబ్లిష్ చేశారు.

ఈ వీడియోకు చెందిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని కథనాలను ప్రచారం చేశారు.

నిజ నిర్ధారణ:

వికారాబాద్ మహిళ కిడ్నాప్ దృశ్యాలు అంటూ వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజీలో ఎటువంటి నిజం లేదు. వైరల్ అవుతున్న వీడియో కర్ణాటక రాష్ట్రం కోలార్ లో చోటుచేసుకున్న ఘటన. ఆగష్టు 2020న ఈ ఘటన చోటుచేసుకుంది.

వైరల్ అవుతున్న వీడియోలపై వికారాబాద్ ఎస్పీ సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. దీపిక కిడ్నాప్ కు సంబంధించి ఎటువంటి సీసీటీవీ ఫుటేజీలు లేవని అన్నారు. "ఇటీవల వికారాబాద్ పట్టణం లో బాలిక అపహరణ విషయం లో ఎలాంటి సి‌సి‌టి‌వి వీడియో లు లేవు. సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నటువంటి బాలికను ఎత్తుకొని కార్ లో తీసుకో పోయే వీడియో వికారాబాద్ ప్రాంతానికి సంబంధించినది కాదు. సోషల్ మీడియా లో వస్తున్నటువంటి పుకార్లను నమ్మవద్దు–ఎస్‌హెచ్‌ఓ,వికారాబాద్." అంటూ పోస్టు పెట్టారు.



వైరల్ అవుతున్న వీడియో కోలార్ లో చేసుకుంది. పట్టపగలు 11:30 సమయంలో యువతిని కిడ్నాప్ చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డు అయింది.

ఈ ఘటనలో కిడ్నాప్ అయిన యువతి పేరు 'శిల్ప'. ఆమెను శివశంకర్, బాలాజీ, దీపక్ అనే ముగ్గురు కలిసి కిడ్నాప్ చేశారు. శివ శంకర్ ఈ కిడ్నాప్ కు మాస్టర్ మైండ్ అని చెబుతున్నారు. శిల్ప శివ శంకర్ ను పెళ్లి చేసుకోడానికి నిరాకరించడంతో అతడు కిడ్నాప్ కు యత్నించాడు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు.

కోలార్ ఎస్పీ కార్తీక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ అయిన యువతి తుముకూరు లోని జిల్లాలోని ఓ లాడ్జిలో దొరికిందని వెల్లడించారు. ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అతడు ప్రయత్నించాడు. కానీ శిల్ప తెలివిగా తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి చెప్పింది. కోలార్, తుముకూరు పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి.. కిడ్నాపర్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని.. వారిని అదుపు లోకి తీసుకున్నారు.

ఆ మహిళ ఎప్పటి లాగే కోలార్ లో తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ వెళుతోంది. క్షణాల్లో ఆమె ముందు ఓ కారు వచ్చి ఆగడం.. వెంటనే ఆమెను లాక్కుని వెళ్లడం.. క్షణాల్లో జరిగిపోయాయి. ఆమె స్నేహితురాలు కాపాడాలని ప్రయత్నించినా వీలు పడలేదు. శిల్పను కారులోకి లాక్కోగానే.. శరవేగంగా కారు దూసుకుని వెళ్ళిపోయింది. ఈ ఘటన మొత్తం కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ లో చోటు చేసుకుంది.

వికారాబాద్‌ పట్టణంలో తల్లి చూస్తుండగానే కూతురిని కిడ్నాప్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన తల్లీకూతురు షాపింగ్‌ కోసం బయటకు వచ్చారు. ఎంఆర్‌పీ చౌరస్తా సమీపంలో సాయంత్రం 6 గంటలకు అందరూ చూస్తుండగానే, తల్లి ఎదుటే కూతురిని కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన యువతి తల్లిని పోలీసులు ప్రశ్నించగా తమ కూతురికి రెండేళ్ల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడితో ప్రేమ వివాహం జరిగిందని, అనంతరం అమ్మాయి ని తమ వద్దే ఉంచుకుంటున్నామని తెలిపింది. ఆమె కిడ్నాప్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో లభించలేదు.

వికారాబాద్ మహిళ కిడ్నాప్ కు సంబంధించిన వీడియోలు అంటూ వైరల్ అవుతున్న పోస్టులు 'అబద్ధం'.

Next Story