కేటీఆర్ గారూ.. మీ దెబ్బకు నా ముక్కు ఎర్రగా వాచింది
By తోట వంశీ కుమార్ Published on 12 April 2020 4:20 PM GMTమంత్రి కేటీఆర్ ఇచ్చిన పంచ్‌కు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముక్కు ఎర్రగా అయిపోందట. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం వర్మకు అలవాటు. తాజాగా శుక్రవారం వర్మ ట్వీట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు ఓ ప్రశ్న వేశాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అందరి కష్టాలను తీరుస్తున్న మంత్రి కేటీఆర్.. వర్మకు అదిరిపోయే సమాధానం ఇచ్చారు. కాగా మంత్రి ఇచ్చిన రిప్లై ట్వీట్ పై వర్మ మళ్లీ ట్వీట్ చేశాడు.
అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందంటే.. లాక్‌డౌన్ వల్ల పలు ప్రాంతాల్లో మద్యం దొరక్క మందు బాబులు వింతగా ప్రవరిస్తున్న సంగతి తెలిసిందే. కొందరు ఆస్పత్రులకు వెళ్తుండగా.. మరికొందరు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓ నిర్ణయం తీసుకున్నారని, మద్యాన్ని హోం డెలీవరీ చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదు. అవి నిజమైన వార్తలు అని నమ్మిన వర్మ.. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రి కేటీఆర్ లను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీగ్ చేశాడు.
పశ్చిమ బెంగాల్‌లో మాదిరి ఇక్కడ కూడా మద్యం హోం డెలివరీ చేయాలని కోరాడు. జనాలు ఇంట్లో బోర్ కొట్టి జుట్టు పీక్కుంటున్నారని, చిన్నపిల్లలా ఏడుస్తున్నారని, పిచ్చిపట్టి ఆస్పత్రుల చేట్లూ తిరుగుతున్నారని, చిరాకులో భార్యలపై చేయి చేసుకుంటున్నారని, వీరి కోసం మమతా బెనర్జీ లాంటి పెద్ద మనస్సు ఉండాలి. అలాంటి పద్ధతినే ఇక్కడ కూడా ప్రవేశపెట్టండి అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ..‘రామూ గారూ.. హెయిర్ కట్ గురించే అడుగుతున్నారు కదా' అంటూ చమత్కరించారు. కాగా, కేటీఆర్ రిప్లైపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ’కేటీఆర్ సర్.. నేను మీరు ఇచ్చిన రిప్లైను గుర్తించలేదు. మీలో ఉన్న హాస్య చతురత నాకు చాలా ఇష్టం. మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు ఎర్రగా వాచిపోయింది. ప్రస్తుతం మీ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిది’అంటూ ట్వీట్ చేశారు.