18 నెలలుగా జైల్లోనే వరవరరావు.. ఆసుపత్రి పాలయ్యారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 May 2020 5:07 PM GMT
18 నెలలుగా జైల్లోనే వరవరరావు.. ఆసుపత్రి పాలయ్యారు

విప్లవ కవి, విరసం నేత వరవర రావు ఆసుపత్రి పాలయ్యారు. 81 సంవత్సరాల వరవార రావు... నవీ ముంబై లోని తలోజి జైలులో ఉన్నారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేనందున జెజె ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఈ ఆసుపత్రి పూణే లోని విశ్రాంబాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంది. హైదరాబాద్ లో ఉంటున్న వరవరరావు ఫ్యామిలీ ఈ వార్త వినగానే షాక్ కు గురైంది. ఆయనను బయటకు తీసుకుని రావాలని కొన్ని రోజులుగా ఆ కుటుంబం ప్రయత్నిస్తూ ఉంది.

భారత ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నారన్న అభియోగాలపై వరవరరావును 2018 లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటూ మరో ఎనిమిది మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమా-కోరేగావ్ అల్లర్లలో కూడా ఆయన పాత్ర ఉందన్న అభియోగాలు మోపబడ్డాయి.వరవరరావు కుటుంబ సభ్యుడు ఎన్. వేణుగోపాల్ న్యూస్ మీటర్ తో మాట్లాడారు. వరవరరావు భార్య హేమలతకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ నుండి ఫోన్ కాల్ వచ్చిందని.. మీ భర్త ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు అని వాళ్ళు తెలిపారని.. అంతకు మించి మాకు ఎటువంటి సమాచారం లేదని వేణుగోపాల్ అన్నారు. పూణే లోని పోలీసు అధికారులకు సంబంధించిన సమాచారం కూడా తమకు ఇవ్వలేదని అన్నారు. మూడు రోజుల కిందట తాలోజీ జైలు నుండి విడుదలైన ఓ వ్యక్తి వరవరరావు ఆరోగ్యం బాగాలేదని హేమలతతో చెప్పారట. దీంతో ఆయన్ను వెంటనే విడుదల చేయాలని కుటుంబ సభ్యులే కాకుండా పలువురు స్నేహితులు, సపోర్టర్లు డిమాండ్ చేశారు, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని తాము అనుకున్నామని.. కానీ ఫలితం లేకుండా పోయిందని వేణుగోపాల్ చెప్పుకొచ్చారు.

ఆయనకు బెయిల్ తీసుకుని రావాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతూనే వస్తున్నాయి. లాయర్లు కూడా ఆయన్ను జైలులో కలుసుకోకుండా చేస్తున్నారని ఆరోణలు వస్తున్నాయి. ఆయనకు వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. హృద్రోగాలు కూడా ఉన్నాయని సన్నిహితులు తెలిపారు. దాదాపు 18 నెలలుగా ఆయన నవీ ముంబై లోని జైలులోనే ఉన్నారు. ఆయనను విడిచిపెట్టాలని పలువురు కోరుతూ ఉన్నారు.

Next Story