ఉన్నది పోయింది... ఉంచుకున్నదీ పోయింది..

By అంజి  Published on  19 Jan 2020 8:38 AM GMT
ఉన్నది పోయింది... ఉంచుకున్నదీ పోయింది..

రాజకీయంగా తప్పటడుగులు, తప్పుటడుగులు వేయడం ఎలా? ఈ విద్యను ఎవరైనా నేర్చుకోవాలంటే ఒకప్పటి విజయవాడ రాజకీయ దిగ్గజం వంగవీటి రాధాకృష్ణ దగ్గరే నేర్చుకోవాలి. మొదట్నుంచీ ఆయన రాజకీయం సముద్రం ఒడ్డున ఇసుక గూళ్లు కష్టపడి కట్టుకుని, తరువాత కాలితో తన్నేసి పోవడమే. అందుకే ఆయన రాజకీయ గొంగడి ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టుంది.

2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఓటమి తప్పదన్నది, వైసీపీ విజయ దుందుభి మోగిస్తుందన్నది ప్రైమరీ స్కూలు గుడి గంట మోగినంత స్పష్టంగా అందరికి ముందే తెలిసిపోయింది. కానీ వంగవీటి రాధాకృష్ణ సరిగ్గా అదే సమయంలో జగన్ తో విభేదించారు. విజయవాడ సెంట్రల్ సీటు కావాలన్నారు. అది మల్లాది విష్ణుకి రిజర్వ్ అయిపోయిందని జగన్ చెప్పారు. కావాలంటే మచిలీపట్నంలో ఎంపీగా పోటీ చేయమని సలహా ఇచ్చారు. ఇది రాధాకి నచ్చలేదు. ఆయన వైసీపీని వదిలేశారు. టీడీపీ కూడా ఆయనకు విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వలేదు. ఆఖరికి మచిలీపట్నాన్ని కూడా ఆఫర్ చేయలేదు. “ఉన్నది పోయింది, ఉంచుకున్నదీ పోయింది” అన్నట్టు తయారైంది ఆయన పరిస్థితి. ఆఖరికి వైసీపీ విజయదుందుభి మోగించింది. విజయయాత్రలో గజమాలతో ముందుండాల్సిన రాధా ఇంటి కిటీకీనుంచి చూసి ఉసూరుమనుకునే పరిస్థితికి వచ్చారు.

ఇప్పడాయన రాజకీయంగా సుప్త చేతనావస్థలో ఉన్నారు. ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఇప్పుడు జగన్ కు చాలా చేరువ. జగన్ నాని మాట వింటారు. వారిద్దరూ కలిసి నెమ్మదిగా రాధాను వైసీపీలోకి తీసుకువచ్చేందుకు పూనుకున్నారు. ఎలాగోలా జగన్ ని ఒప్పించే పనిలో పడ్డారు. అలాంటి పరిస్థితిలో రాధా కాస్త సైలెంట్ గా ఉండాల్సింది. కానీ ఆయన ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు ర్యాలీలకు మద్దతు ప్రకటించారు. ఆయన అరెస్టయితే ఇంటికి వెళ్లి మరీ మద్దతు పలికారు. రాధా చేసిన ఈ పని వల్ల పాపం నాని, వంశీలకు ఆదిలోనే హంసపాదు ఎదురైనట్టయింది. ఇప్పుడు జగన్ దగ్గర వాళ్ల మాట పోయినంత పనైంది..

నిజానికి వంగవీటి రాధా మొదట్నంచీ రాజకీయ తప్పిదాలు చేయడంలో ఘనాపాఠీ. 2004 లో వైఎస్ రాజశేఖర రెడ్డి దయ వల్ల ఎమ్మెల్యే అయ్యారు. ఫైర్ బ్రాండ్ నేతగా పేరొందారు. మళ్లీ టికెట్ ఇద్దామనుకునే లోపు 2009 లో ఆయన ఉన్నట్టుండి ఇసుకగూడు తన్నేసి ప్రజారాజ్యంలోకి జంప్ అయ్యారు. ఆ రాజకీయ తప్పిదం వల్ల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన మళ్లీ ఇసుకగూడు తన్నేసి వైసీపీలోకి వచ్చారు. కాసింత యాక్టివ్ గానే పనిచేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. మళ్లీ ఇసుకగూడు తన్నేశారు. టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇప్పుడు వైసీపీలోకి ఆయన్ని తెచ్చేందుకు ప్రయత్నం జరుగుతోంది. మళ్లీ ఆయన తొందరపడి ఇసుకగూడు తన్నేశారు.

మరి ఇప్పుడాయన ఏం చేస్తారు? మళ్లీ ఇసుకగూడు కట్టుకుంటున్నారు!! ఆ తరువాతేం చేస్తారు? కట్టుకున్న ఇసుక గూడును మళ్లీ తన్నేస్తారేమో మరి!!

Next Story