వంగపండు కన్నుమూత
By తోట వంశీ కుమార్ Published on 4 Aug 2020 9:53 AM ISTప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు మంగళవారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 1943లో పెదబొండపల్లిలో జన్మించిన వంగపండు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మంగళవారం తెల్లవారుజూమున విజయనగరం జిల్లా పార్వతీపురం పెద్ద బొందపల్లిలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. మూడు దశాబ్దాల పాటు వందల జానపద పాటలు రచించిన వంగపండు పేద, గిరిజనులను ఎంతో చైతన్య పరిచారు. విప్లవ కవిగా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు పొందారు.
1972లో జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో బడుగుబలహీన వర్గాలను, గిరిజనులను చైతన్య పరిచారు. 'ఏం పిల్లడో ఎల్దమొస్తవ పాట'తో వంగపండు ప్రఖ్యాతి చెందారు. 'అర్థరాత్రి' స్వాతంత్య్రం సినిమాతో వంగపండు సినీ ప్రస్థానం మొదలైంది. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత కళారత్న పురస్కారం అందుకున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాం తెలిపారు.
వంగపండు ప్రసాద రావు మృతికి ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించిందని ఆయన అన్నారు. వంగపండు వ్యక్తిగతంగా తనకు ఆప్తులు అని అన్నారు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామను పొడిచిన చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారని తన ప్రకటనలో పేర్కొన్నారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారన్న సీఎం.. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
వంగపండు మరణంపై ప్రజాగాయకుడు, విప్లవకవి గద్దర్ స్పందిస్తూ.. వంగపండు పాట కాదు ప్రజల గుండె చప్పడు. అక్షరం ఉన్నంత వరకు వంగపండు ఉంటాడు. ఆయన పాటలు 10 భాషల్లోకి అనువదించబడ్డాయి. మూడు దశాబ్ధాలలో 300కుపైగా పాటలు పాడారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఘనత వంగపండుది అని పేర్కొన్నారు.