కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీహెచ్‌కి కరోనా పాజిటివ్
By తోట వంశీ కుమార్ Published on 21 Jun 2020 9:37 AM IST
తెలంగాణలో శరవేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కరోనా తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో వెంటనే ఆయన నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించారు. వారంతా స్వీయ నిర్భంధంలో ఉన్నారు. గత వారం రోజులుగా వీహెచ్ ఎవరెవరో ఇంటరాక్ట్ అయ్యారో వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు అధికారులు. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్, బీగాల గణేష్ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలగా ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
శనివారం రాష్ట్రంలో కొత్తగా 546 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఐదుగురు మృత్యువాత పడినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7072కి చేరగా.. 203 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 458 కేసులు నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత రంగారెడ్డిలో 50, కరీంనగర్ జిల్లాలో 13 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం నమోదు అయిన కేసుల్లో 3506 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 3363 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.