ఉత్తరాంధ్ర రాజధాని ఇక్కడే కట్టనున్నారా?
By అంజి Published on 19 Dec 2019 1:10 PM ISTవిశాఖ: మూడు రాజధానుల మాటను ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక తేనెతుట్టెను కదిల్చారు. దీంతో వివాదాలు, విమర్శల తేనెటీగలు ఇప్పుడు చంద్రబాబును చుట్టు ముట్టేస్తున్నాయి. జగన్ వ్యూహంలో చిక్కుకున్న చంద్రబాబు నాయుడు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి లా ఉంది.
కానీ మరో వైపు కర్నూలు, విశాఖపట్నం నగరాల్లో ప్రజల్లో మాత్రం రాజధాని కోసం ఏయే భవనాలు కట్టబోతున్నారు, ఎక్కడ కట్టబోతున్నారు, భూములెక్కడ అందుబాటులో ఉన్నాయి వంటి చర్చలు జోరందుకున్నాయి. వైజాగ్ కి 25 కి.మీ దూరంలో ఉన్న ముడసర్లోవలో కొత్త రాజధాని వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే వైజాగ్ లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సేకరించారు. రాజధాని నిర్మాణానికి 500-600 ఎకరాల భూమి అవసరమౌతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంత భూమి అందుబాటులో ముడసర్లోవ వద్ద ఉంది. కాబట్టి ఇక్కడే నిర్మాణాలు జరిగే అవకాశాలున్నాయి.
వైజాగ్ లో పోర్టు భూములు ఉన్నా, వాటిని స్వాధీనం చేసుకోవాలంటే చాలా తంతు ఉంది. ముందు కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. కేంద్రానికి ఆ భూమి బదులు ఇంకో చూట భూమిని ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువ. అంతే కాదు భూగర్భ జలాలు కూడా కలుషితమై ఉన్నాయి. కాబట్టి దాని కన్నా ముడసర్లోవ అయితే బాగుంటున్నది అధికారులు భావన. అయితే సెక్రటేరియట్ ను అమరావతిలోనే ఉంచి, అసెంబ్లీ భవనం, మినీ రాజభవన్ లను ముడసర్లోవలో నిర్మించే అవకాశం ఉంది. ఇలా చేస్తే గవర్నర్ ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చినప్పుడు ఇక్కడ విడిది చేయడానికి, ఏడాదిలో ఒక అసెంబ్లీ సెషన్ ను నిర్వహించేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో ఇప్పుడందరి దృష్టీ ముడసర్లోవపైనే ఉంది.
అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు..
కాగా మరో వారం రోజుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై నిపుణుల కమిటీ నివేదిక అందించనుంది. రాజధానిపై సీఎం జగన్‌కు జీఎన్‌రావు కమిటీ నివేదిక సమర్పించనుంది. రాజధాని అంశంపై ఇప్పటికే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే నిపుణుల కమిటీని రైతు పరిరక్షణ కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మూడు రాజధానుల నిర్మాణంపై అమరావతిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయం వైపుగా రైతులు ర్యాలీ చేపట్టారు. పలువురు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, మహిళలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భారీగా పోలీసులు మోహరించారు. మందడం దగ్గర రైతులు. మహిళలు ర్యాలీ చేపట్టారు. మూడు రాజదానులు వద్దంటూ వెలగపూడిలో రైతులు రిలే నిరాహారా దీక్షలు చేపట్టారు.
హైకోర్టులో విచారణ..
రాజధానిపై ఏపీ హైకోర్టులో రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. నిపుణులు కమిటీని నిరసిస్తూ రైతుల పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది. రాజధాని కోసం భూములు తీసుకొని నిపుణుల కమిటీ వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 3కు వాయిదా వేసింది.