జూన్‌ నాటికి మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టులు..!

By అంజి  Published on  18 Dec 2019 10:09 AM GMT
జూన్‌ నాటికి మచిలీపట్నం.. రామాయపట్నం పోర్టులు..!

ముఖ్యాంశాలు

  • పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్‌ సమావేశం
  • రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సమీక్ష
  • మచిలీపట్నం పోర్టుకు ఇప్పటికే భూమి అందుబాటులో ఉంది: సీఎం

అమరావతి:

క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. దుగ్గరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడ పోర్టుల నిర్మాణంపై ప్రణాళికలు తయారీకి సీఎం జగన్‌ ఆదేశించారు. మొదటి ఫేజ్‌లో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పోర్టును వీలైనంత వేగంగా నిర్మించాలని, ఈ పోర్టుకు ఇప్పటికే భూమి అందుబాటులో ఉందన్నారు. మిగిలిన పోర్టులు నిర్మాణం చేసేచోట అవసరమైన సమీకరించాలని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టుకు వచ్చే జూన్‌నాటికి పైనాన్షియల్‌ క్లోజర్‌ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. మే, జూన్‌ నాటికి మరో రెండు పోర్టులకు శంకుస్థాపన చేయనున్నారు. విభజన చట్టం ప్రకారం పోర్టును నిర్మించి ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఆమేరకు నిధులను కేంద్రం నుంచి ఇప్పించుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.

అధికారులతో చర్చ సందర్భంలో ప్రభుత్వ ప్రాధాన్యతలను సీఎం జగన్‌ వివరించారు. నవరత్నాలు, నాడు-నేడు పథకాల అమలు, ప్రతి ఏటా 6 లక్షల ఇళ్లు నిర్మించాలని సీఎం జగన్‌ పేర్కొన్నాఉ. రాయలసీమ ప్రాజెక్టులకు జలాలు వెళ్తున్న కాల్వల విస్తరణ పనులను పరిశీలించాలన్నారు. పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌ అక్కడినుంచి బనకచర్లకు గోదావరి జలాలు తరలించాలన్నారు. ప్రతి జిల్లాకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా తాగునీరు అందించడమే తమ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమాల వల్ల అత్యధిక ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయరంగంలో స్థిరత్వం ఉంటుందని, కరువు ప్రాంతాలకు ఊరట లభిస్తుందన్నారు.

నవరత్నాల కార్యక్రమాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాలకు భరోసా లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. విద్యుత్‌ సంస్కరణల అంశాన్ని కూడా ఈ సమావేశంలో సీఎం జగన్‌ చర్చించారు. ప్రతి ఏటా విద్యుత్‌ సబ్సిడీల రూపంలో సుమారు రూ.10 వేల కోట్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తున్నామన్నారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వమే 12 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. వచ్చే మూడు, నాలుగు సంవత్సరాల్లో ట్రాన్స్‌కోకు ఇస్తున్న సబ్సిడీ డబ్బుతో 12 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి రానుందన్నారు. ఈ దిశగా ఆలోచన చేయాలని అధికారులకు సీఎం జగన్‌ నిర్దేశం చేశారు.

Next Story