తగలబడుతోన్న దేవభూమి: అరుదైన వృక్షాలు బుగ్గిపాలు

By సుభాష్  Published on  27 May 2020 8:34 AM GMT
తగలబడుతోన్న దేవభూమి: అరుదైన వృక్షాలు బుగ్గిపాలు

ముఖ్యాంశాలు

  • నాలుగు రోజులుగా తగలబడుతోన్న అడవి

  • కార్చిచ్చులో బూడిదవుతున్న విలువైన ఔషధ మొక్కలు

  • మంటల్లో సజీవదహనం అవుతున్న వన్యప్రాణులు

దేవభూమిగా భావించే ఉత్తరాఖండ్‌ మంటల్లో చిక్కుకుంది. ఉత్తరాఖండ్‌ అడవుల్లో గత నాలుగు రోజుల నుంచి కార్చిచ్చు చెలరేగుతోంది. ఈ కార్చిచ్చులో వేలాది అరుదైన వృక్షాలు, ఔషధ మొక్కలు బుగ్గిపాలవుతున్నాయి. అంతే కాదు వందలాదిగా వన్యప్రాణాలు సైతం సజీవదహనం అవుతున్నాయి. కొన్ని వన్యప్రాణాలు మంటల నుంచి కాపాడుకోవడానికి జనవాసాల్లోకి పరుగులు పెడుతున్నాయి.

హిమాలయ పర్వత పంక్తులకు ఆనుకుని ఉండే అడవులు కావడం వల్ల అరుదైన జాతికి చెందిన వృక్షాలు, ఔషధ మొక్కలకు ఉత్తరాఖండ్‌ ఎంతో పేరుంది. అలాంటి అరుదైన ఔషధ మొక్కలు అగ్నిలో కాలి బూడదవుతున్నాయి. గత నాలుగు రోజులు నుంచి చెలరేగుతున్న మంటల వల్ల మొక్కలు, వన్యప్రాణాలు ఆహుతి అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మంటలను నియంత్రించడంలో ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం విఫలమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు కొత్తేమిది కాదు..

కాగా, అటవీ ప్రాంతం అధికంగా ఉండే ఉత్తారఖండ్‌లో కార్చిచ్చు చెలరేగడం ఇది కొత్తేమి కాదు. ప్రతి ఏడాది వేసవిలో అడవులు అంటుకుంటూనే ఉన్నాయి. ప్రతి సారి వ్యాపించే కార్చించ్చు పెద్దగా ఉండకపోయినా.. ఈసారి మాత్రం భారీగా మంటలు చెలరేగుతున్నాయి. దీంతో పర్యావరణ ప్రేమికులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇంత భారీగా మంటలు చెలరేగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం మంటలు చెలరేగకుండా విలువైన ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు, వన్య ప్రాణాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Next Story
Share it