ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం.. సీఎం సిగ్గుతో తలదించుకోవాలి : ఉత్తమ్‌

By Medi Samrat  Published on  16 July 2020 1:17 PM GMT
ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనం.. సీఎం సిగ్గుతో తలదించుకోవాలి : ఉత్తమ్‌

ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు రావటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. గురువారం ఉస్మానియా ఆసుప‌త్రిని సంద‌ర్శించిన ఆయ‌న అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా టెస్టులు ఎక్కువ చేస్తే పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తాయని.. అందువల్లే టెస్టులు తక్కువ చేస్తున్నారని కేసీఆర్‌పై ఫైర‌య్యారు.

క‌రోనా మరణాల సంఖ్యను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం తక్కువ చేసి చూపిస్తుంద‌ని ఉత్త‌మ్ మండిపడ్డారు. కరోనా కార‌ణంగా హైదరాబాద్‌ ప్రజలు భయాందోళనకు గుర‌వుతున్నార‌ని.. ప్రభుత్వ పని తీరుతో ప్రభుత్వ ఆసుపత్రులపైన జనాలకు నమ్మకం పోయిందని.. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల మీద‌ ప్రభుత్వానికి నియంత్రణ లేదని ఆరోపించారు.

కరోనా కార‌ణంగా ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్న నేఫ‌థ్యంలో క‌రోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చటం లేదో కేసీఆర్ చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. ఉస్మానియా హాస్పిట‌ల్‌ను కాపాడుకోవాలని.. కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యుల‌కు, న‌ర్సుల‌కు 50 శాతం జీతం ఎక్కువ ఇవ్వాలని ఉత్తమ్ ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ వ్యాఖ్య‌ల‌పై మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. ఉస్మానియా ఆసుపత్రి భవనాలు కూలితే బాధ్యలు ఎవరని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆసుపత్రి కేసును హైకోర్టు సూమోటాగా తీసుకుని, పరిష్కరించాలని కోరారు. పేదల కోసం 27ఎకరాల్లో ఉస్మానియాను పునర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని తప్పుబట్టారు. తమ ప్రభుత్వానికి కోర్టులపై, చట్టాలపై నమ్మకం ఉందని తెలిపారు. ఆసుపత్రిలోకి నీళ్లు వచ్చినంత మాత్రానా హంగామా చేస్తారా.. తెలంగాణలో ఉన్న ధరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రణాళిక ఉందని తెలిపారు.

ఇదిలావుంటే.. వర్షం వల్ల బుధ‌వారం ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో మురుగునీరు చేరి.. అక్కడి రోగులు పడుతున్న ఇక్కట్లు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చూసిన తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్.. దీనిని సుమోటోగా స్వీకరించి సూపరింటెండెంట్, ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి వారి నివేదికను 21వ తేదీ ఆగస్టు 2020 వరకు దాఖలు చేయవలసినదిగా ఆదేశించింది.

Next Story