మన్నెం మహిళలకు మరో ఉషస్సు.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 16 Aug 2020 5:21 PM ISTనలుగురు తనను చూసి నవ్వుకున్నారని.. తీసేసినట్టు మాటాడరని.. గడ్డిపోచకంటే హీనంగా చూశారని ఉషారాణి నాయక్ ఏనాడు కుంగిపోలేదు. కంటతడి కూడా పెట్టలేదు. తన మనసును రాయి చేసుకుంది. నోటి మాట ద్వారా కాదు చేతల ద్వారా తనేంటో చాటి చెప్పాలనుకుంది. గడ్డిపోచలతో కళాకృతుల తయారీకి శ్రీకారం చుట్టింది. క్రమంగా తనలోని కళకు పదుగురి గుర్తింపు వచ్చింది. పడ్డ శ్రమకు సొమ్ము రావడం మొదలయింది. అక్కడితో తృప్తి పడిఉంటే.. ఇవాళ ఉషారాణి నాయక్ గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ ఉండేది కాదు. తనలాగే పురుషాధిక్యానికి దెబ్బతిని కుంగిపోతున్న సాటి మహిళల్ని మేల్కొలిపింది. వెనకబడితే వెనకేనోయ్ అంటూ హెచ్చరించింది. తిట్టిన నోళ్లే పొగిడేలా వారిలో సాధికారతను పాదుగొలిపింది. ఇది ఓ మన్నెం మహిళ విజయగాధ!!
ఉషారాణి పేదకుటుంబంలో పుట్టింది. పేదరికంలోనే పెరిగింది. ఓడిశాలోని మయూర్‌భంజ్‌జిల్లా గుజల్‌దీహీ ఆమె స్వగ్రామం. బాతూడి అనే గిరిజనతెగకు చెందిన ఉషారాణి పేదరికం వల్లనే చదువును మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. కట్నం ఇచ్చుకోలేని కారణంగా ఆమెకు 22 ఏళ్లకు పెళ్లయింది. ‘కుటుంబానికి నా పెళ్ళి భారం కారాదని నేనే అప్పు చేసి పెళ్ళి చేసుకున్నా. పెళ్ళయ్యాకయినా తలరాత మారుతుందేమోని ఆశించా! కానీ అప్పుడు కష్టాలు తప్పలేదు. అవసరం వచ్చినప్పుడల్లా పైసా పైసా వెతుక్కోవాల్సి వచ్చేది. ఇంటి ఖర్చులు మొగుడినే అడగాల్సి వచ్చేది. ఇదో రకం బానిస బతుకనిపించింది.. సొంతంగా డబ్బు సంపాదిస్తేగానీ ఆడదానికి గౌరవం ఉండదని నాకనిపించింది. అప్పట్నుంచే నా ఆలోచనలో మార్పు మొదలయ్యింది’ అంటోంది ఉషారాణి.
ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దాన్ని అమలు చేసేదాకా ఉషారాణకి నిద్రపట్టలేదు. 2001లో కొందరు గిరిజన మహిళల్ని జతచేసుకుని స్వయంసహాయక సంఘం కట్టింది. కోళ్ళు, మేకలు, తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించింది. అయితే ఎందుకో ఆ సంఘం విజయవంతం కాలేకపోయింది. ఇలాంటి వైఫల్యాల ఎప్పుడవుతాయా అని గమనిస్తున్న కొందరు వెక్కిరించడం ప్రారంభించారు.
అయితే ఉషారాణి ధైర్యం కోల్పోలేదు. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని గట్టిగా అనుకుంది. ఈ సమయంలో ఒక ఆలోచన వెలిగింది. ఒక్క అయిడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్టు.. ఉషారాణి బుర్రలో వచ్చిన ఆ ఆలోచన వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసింది. స్థానికంగా పెరిగే సుబాబ్ గడ్డితో గిరిజనులు రకరకాల ఉత్పత్తులు చేస్తుంటారు. ఆ గడ్డితో కళాత్మకంగా ఏవైనా రూపొందిస్తే పట్టణాల్లో మంచి మార్కెట్ ఉంటుందని అనుకుంది. మొదట ఈ గడ్డితో తాళ్ళు తయారు చేసేది. గడ్డితో తాళ్ళు పేనడం తన పదేళ్ళ వయసులోనే నేర్చుకుంది. చిన్ననాటి విద్య మళ్ళీ ఇప్పడు ఉపయోగపడుతోంది.
ఈ ప్రయాణం కూడా అంత సుకమేం కాదని ఉషారాణికి తెలిసొచ్చింది. మళ్ళీ అవమానాలు,హేళనలు...అయితే అలవాటు పడిన ప్రాణం కాబట్టి ఉషారాణి వీటిని పెద్దగా మనసుకు తీసుకోకుండా తనేం చేయగలదో అది చేస్తూ ముందుకు సాగింది. కొన్నాళ్ళకు గడ్డితో మ్యాట్‌లు, చాపలు, స్టాండ్‌లు తయారు చేయడం ప్రారంభించింది. ఈ పనికి ముందు గిరిజన మహిళలతో కలిసి శిక్షణ తీసుకుంది.
డీఐసీ వీరిని కటక్‌లో ఎగ్జిబిషన్‌కు తీసుకెళ్ళారు. అక్కడ దాదాపు రూ.20 వేల విక్రయాలు చేయగలిగారు. అయితే అవి నాసిరకంగా ఉన్నాయని తిరిగివ్వడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. మళ్ళీ ఎక్కడ పాతదారికి వెళ్ళిపోతామో అని ఉషారాణి భయపడింది. అప్పటికే రూ.40వేల అప్పు కొండలా కనిపిస్తోంది. ఈసారి చాలా ధైర్యం కూడదీసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఒడిశా రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మార్కెటింగ్ సొసైటీ సాయానికి ముందుకొచ్చింది. కొద్ది కాలానికే తీసుకున్న అప్పు తీర్చేశారు. ఆ తర్వాత ఏకంగా రూ.25 లక్షలు రుణం తీసుకుని పెద్ద పెట్టుబడి పెట్టి మార్కెట్‌లో విస్తారంగా తమ ఉత్పత్తుల్ని అమ్మాసాగారు.
ఈ సారి అపజయాలు ఆమెను పలకరించలేదు. మయూర్‌భంజ్ సబాయ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పేరిట తనే ఓ పర్యావరణ హిత హస్తకళా ఉత్పత్తుల సంస్థ ప్రారంభించింది. దాదాపు 200 మంది గిరిజన మహిళలు జట్టు కట్టారు. సబాయ్ గడ్డితో కళాకృతులు తయారీ బాగా ఊపందుకుంది. 2019లో రూ.25 లక్షల విలువచేసే ఆర్డర్ రావడంతో వీరి భవిష్యత్తు ఒక్కసారిగా మలుపు తిరిగింది. అందరూ విపరీతంగా శ్రమించి తక్కవ వ్యవధిలో ఆ ఆర్డర్ పూర్తి చేశారు.
మయూర శిల్పా.కామ్ పేరిట ఆన్‌లైన్ వ్యాపారం ప్రారంభించారు. ఊరిని చక్కబెట్టాక ఇరుగుపొరుగూళ్ల గిరిజన మహిళల్ని చైతన్యపరిచే పనిలో పడింది ఉషారాణి. వారితో మహిళా సంఘాలు ఏర్పాటు చేసి గడ్డితో కళాకృతుల తయారీ ప్రారంభింపజేసింది. ఈ సంఘంలో డిగ్రీ పూర్తి చేసిన యువతులు ఉండటం విశేషం. గతేడాది రూ.30 లక్షల ఉత్పత్తులు అమ్మడం ద్వారా రూ.19 లక్షల లాభాలు గడించింది.
ప్రభుత్వం వారికోసం బారిపాద, రాజధాని భువనేశ్వర్‌లో ఉత్పత్తులు విక్రయించుకోడానికి షాపులు కేటాయించింది. ఒకప్పుడు ఉషారాణిని తిట్టినోళ్లే తమ బతుకులను బాగు చేయాల్సిందిగా వచ్చి కోరుతున్నారు. మనం మాట్లాడాల్సిన పనిలేదు.. మనమేంటో మన పనే చెబుతుంది అన్న సూత్రాన్ని ఇప్పటికీ నమ్మి ఆచరిస్తోంది కాబట్టే.. ఉషారాణి మన్యం మహిళల జీవితాల్లో సరికొత్త ఉషస్సులు తెస్తోంది.