ఆకాంక్షలు నెరవేర్చుకున్న ధీర..

By మధుసూదనరావు రామదుర్గం  Published on  15 Aug 2020 1:30 PM GMT
ఆకాంక్షలు నెరవేర్చుకున్న ధీర..

పెద్దయ్యాక నువ్వేం కావాలనుకుంటున్నావ్‌.. పిల్లల్ని పెద్దలు తరచూ అడిగే ప్రశ్న. వారు కొన్నిసార్లు తమ మనుసులో ఉన్నది చెప్పడానికి ప్రయత్నించినా.. చాలా సందర్భాల్లో తమ తల్లిదండ్రుల కోరికనే తమ కోరికగా చెబుతుంటారు. మరి పెద్దయ్యాక ఆ కలను సఫలం చేసుకుంటారో లేదో అది వారి శ్రమను బట్టి ఉంటుంది. కానీ పెరిగి పెద్దయ్యాక, ఓ ఉద్యోగంలో చేరాక కూడా ఇలాంటి ప్రశ్న తమ ఉన్నతాధికారుల నుంచి ఎదురైతే.. ఎవరైనా ఏం చెబుతారు? ఈ ఉద్యోగంలో రాణించాలనుకుంటున్నానంటారు. కానీ ప్రియా మాల్యా మాత్రం తనో లీడర్‌ అవుతానని చెప్పి అందరిని ఆశ్చర్య పరిచింది. ఆ మాటను అందరూ అర్థం చేసుకున్నారు. ఆమె అహంకారంతో మితిమీరిన ఆత్మవిశ్వాసంతోనో చెప్పడంలేదు.. తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకునే చెప్పిందని అనుకున్నారు. ఇంతకూ ప్రియామాల్య ఉద్యోగ వికాసం ఎలా సాగింది?

ప్రియామాల్య ఐబీఎంలో సాధారణ ఉద్యోగిగా ప్రవేశించింది. అచిరకాలంలోనే అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం డెవలపర్, ఎకో సిస్టమ్స్, ఐబీఎం లీడర్‌. ప్రజలకు టెక్నాలజీని చేరువ చేయడానికి విశేషించి కృషి చేస్తోంది. కరోనాకు కూడా టెక్నాలజీ పరంగా పరిష్కారం కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రియామాల్య ఈ ఏడాది జిన్నోస్‌ అవార్డు కైవసం చేసుకున్నారు. ఈ ఎదుగుదల వెనక ఎంతో శ్రమ దాగుంది. రాత్రికి రాత్రే ఆమె లీడర్‌ కాలేదు.

ప్రియా ఐబీఎంలో చేరిన కొత్తలో మేనేజర్‌ను కలిశారు. మేనేజర్‌ తన దీర్ఘకాలిక లక్ష్యాలేంటో స్లైడ్‌ల ద్వారా వివరించాల్సిందిగా కోరారు. ప్రియా కొంతసేపు ఆలోచించి ఒకే ఒక స్లైడ్‌ వేసింది. అందులో ఒకే పదం ఉంది. అందరూ ఆ పదాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఇంతకూ ఆ పదమేంటో తెలుసా?.. లీడర్‌! చాలామంది కొలీగ్స్‌ ఇది విని.. బహుశా మేనేజర్‌కు ఆగ్రహం తెప్పిస్తుందేమోనని అనుకున్నారు. కానీ మేనేజర్‌ నిండుగా నవ్వి సో ఆంబీషియస్‌.. గుడ్‌ అని అభినందించారు. కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఇక్కడ్నుంచే ప్రారంభమైంది. ఇది జరిగి ఏళ్లు గడిచింది.

సాధారణంగా ఇలాంటి సందర్భాలు చాలా త్వరగా పాతబడిపోతాయి. ఏదో అనుకుంటాం.. అన్నీ జరుగుతాయా ఏంటి? ఇదేగా మనం చెప్పుకునే సమాధానం. కానీ అలా అనకుని ఉంటే తను ప్రియా మాల్య ఎందుకవుతుంది? ఎప్పటికప్పుడు తన లక్ష్యం ఇంకా ఎంత దూరం ఉందని అనుకుంటునే ఉంది. ఎన్నేళ్ళయినా పర్వాలేదు సంస్థ గ్లోబల్‌ లీడర్‌ కావాలన్నదే తన కల ఆకాంక్ష! జ్వలించే ఆ కోరికే ప్రియను నేడు అత్యున్నత స్థానం అధిరోహించేలా చేసింది. ప్రస్తుతం తను ఇండియన్‌ ఐబీఎం డెవలపర్‌ ఎకో సిస్టమ్స్‌ లీడర్‌. ప్రియ ఐబీఎంలో 2006 ఏప్రిల్‌లో చేరారు. ఇప్పుడామె ఇండియా, దక్షిణ ఆసియాలోని డెవలపర్‌ బేస్‌ను దృఢపరిచే పనిలో ఉన్నారు.

కాల్‌ ఫర్‌ కోడ్‌..

ప్రియ విద్యార్థుల్లో ఈ కోడింగ్‌పై అవగాహన ఎలా ఉందో అది తమ సంస్థకు ఎలా అన్వయించుకోవాలో అని ఆలోచించి 2018లో కాల్‌ ఫర్‌ కోడ్‌ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పోటీలో డెవలపర్లు రకరకాలు ఆవిష్కరణలతోపాటు ఎన్నో పరిష్కారాలను రూపొందించడమే కాకుండా పలు సమస్యల్ని పరిష్కరించ వచ్చు. వాతావరణ మార్పులపైనే కాకుండా కోవిడ్‌–19పై సాంకేతికతతో పరిష్కారం రూపొందించేందుకు ఐబీఎం సిద్ధమైంది.

ప్రియ 2003లో మణిపాల్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేశారు. ఐబీఎంలో చేరక ముందు విప్రోలో చేరారు. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. ఇన్‌స్ట్రక్షన్‌ దశ నుంచి ఎక్స్‌పీరియన్స్‌ దశకు విద్య మారిపోయింది. ఇది స్టూడెంట్స్‌ అర్థం చేసుకోవాలని ప్రియా మాల్య అంటారు. లీడర్‌ కావాలని అనుకోవడమే కాదు లీడర్‌గా ఎదిగి అందరికీ రోల్‌మోడల్‌గా నిలిచిన ప్రియా ఈ ఏడాది జిన్నోవ్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రియాలాంటి వారే నేటి యూత్‌కు రోల్‌మాడల్‌ కావాలన్నది అక్షరసత్యం!!

Next Story