ఆర్ట్‌ ఈజ్‌ శారీఫుల్‌ అంటున్న ఇప్సిక

By మధుసూదనరావు రామదుర్గం  Published on  15 Aug 2020 6:16 AM GMT
ఆర్ట్‌ ఈజ్‌ శారీఫుల్‌ అంటున్న ఇప్సిక

చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం. అదీ కార్పొరేట్‌ కంపెనీలో ఐటీ జాబ్‌. మంచి జీతం.. అంతకన్నా మంచి జీవితం ఇంకేం కావాలి అనుకుంటాం. కానీ ఇప్సికా అలా అనుకోలేదు. ఈ కార్పొరేట్‌ ఉద్యోగం, పని ఒత్తిడి క్రమంగా తనలోని కళాకారిణిని కాల్చేస్తున్నట్టుగా భావించింది. లోలోన బాధపడింది. ఎంత జీతం వచ్చినా.. ఇది కాదు నేను నడవాల్సిన దారి అనుకుంది...వెంటనే దిశ మార్చింది. ఆమె దశ కూడా మారింది. ఎన్నాళ్లో మనసు పొరల్లో అట్టడుగున పరితపిస్తున్న కళాత్మకతను తట్టి లేపింది. చుట్టూ చెంగావి చీరలు కట్టాలనుకునే చిన్నమ్మల కలలు నిజం చేయడం కోసం ఆరు గజాల అందమైన చీరలు ఇవ్వాలనుకుంది. అనుకున్నట్టుగానే ‘6యార్డ్స్‌ అండ్‌ మోర్'‌ పేరిట చీరల వ్యాపారానికి శ్రీకారం చుట్టింది.

దేశ వ్యాప్తంగా విభిన్న చేనేత కళాకారులను కలిసింది. వారి కళలకు తన కళాకాంతితో మెరుగులు దిద్దింది. ఇపుడు తనన కలల చీర ప్రపంచానికి రారాణిగా వెలిగిపోతోంది ఇప్సిక దాస్‌.

ఇప్సిక తన ఇంజనీరింగ్‌ పూర్తి కాగానే అందరిలా సాఫ్టవేర్‌ రంగంలో కాలుపెట్టింది. అప్పటికే తనకు చీరలపై అభిరుచి ఉన్నా అది కేవలం హాబీరూపంలోనే ఉంది. బెంగళూరులో కారిటర్, మైండ్‌ట్రీ, ఇన్ఫోసిస్‌లలో దాదాపు పదేళ్ళపాటు ఏకబిగిన పనిచేసింది. పని ఒకేరీతిగా విసుగ్గా అనిపించడం ప్రారంభమైంది. ఇంకేదో చేయాలన్న తపన నానాటికీ అధికం కావడంతో టెస్ట్‌మైండ్‌ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది.ఇది ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఉద్యోగార్హులుగా తయారు చేస్తుంది. భర్త ఉద్యోగం మారడంతో తను కూడా టెస్ట్‌మైండ్‌ను వదిలేసుకుని బెంగళూరు నుంచి నోయిడాకు వెళ్ళింది. స్థలం మారడంతో ఇప్సికా ఆలోచనల్లోనూ కొత్త కోణాలు కనిపించాయి.

తనలోని సృజనాత్మకతకు రూపం ఇస్తూ తన సోదరి వినితా దాస్‌తో కలిసి 2016లో 6యార్డ్స్‌ అండ్‌ మోర్‌ చీరల వ్యాపారం ప్రారంభించింది. ఇప్సిక ఐటీ జాబర్‌గా ఉన్నప్పుడే తన చీరకట్టులో చాలా శ్రద్ధ కనబరిచేంది. ఆ రంగుల ఎంపిక,మ్యాచింగ్‌ ను చూసి స్నేహితులు, సహోద్యోగులు చాలా మెచ్చుకునేవారు. అందరిలోనూ చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆ ప్రశంసల ప్రోత్సాహం చీరలు సృష్టించే ప్రపంచానికి దారితీసింది. తనలోని సృజనను మేళవించి అందమైన చేనేత చీరలు సృష్టించేలా శ్రమించింది. కొత్త డిజైన్ల కోసం దేశవ్యాప్తంగా తిరిగి చేనేత కళాకారులను ఎంచుకుంది. వారి కళకు తన ఆలోచనల మెరుగులద్ది కొంగొత్త చీరల తయారీకి తెరదీసింది. చీరల వ్యాపారం పుంజుకున్నాక కుర్తాలను జతపరిచింది.

కళాకారుల కోసం అసోం బెంగాల్‌ బీహార్‌ మణిపూర్‌ ఒడిశాలతోపాటు దక్షిణాన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను సందర్శించింది ఇప్సిక. ఏప్రాంతానికి అదే ప్రత్యేకం అన్నట్టుగా ఉన్న చేనేత కళ పటిమను అర్థం చేసుకుని వాటిని తన చీరల ప్రపంచానికి తీసుకొచ్చేసింది. దేశవ్యాప్తంగా ఎవరికి ఎలాంటి చీర కావాలో అలాంటివే అందించే స్థాయికి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసింది. చీరలతో పాటు దుపట్టాలు, కుర్తాలు, టెర్రాకోట జాతిని బోలిన రాళ్ళతో సీసం లేకుండా తయారు చేసిన ఆభరణాలు, హ్యాండ్‌ బ్యాగులు టేబుల్‌ రన్నర్‌లు, బెడ్‌షీట్లు...తదితరాలు తన వ్యాపారానికి అదనపు హంగులుగా సమకూర్చుకుంది.

భారతీయ చీరలకు విదేశీ గిరాకీ పెరిగేలా డిమాండ్‌ సృష్టించింది. విదేశీల్లో ఉంటున్న మహిళల కోసం ప్రవాసీ పేరిట చీరలు మార్కెట్లో తెచ్చింది. ఈ వ్యాపారంలో తన చెల్లెలి కృషి చాలా ఉందని ఇప్సిక అంటోంది. తను కువైట్‌ నుంచే వ్యాపారంలో పాలుపంచుకుంటోంది. వ్యాపారం ప్రారంభించిన ఆరునెలలోనే 15 నుంచి 20 శాతం పురోగతి సాధించడం తనకెంతో ఆనందాన్నిస్తోందని ఇప్సిక అంటోంది. కరోనా సమయంలో దేశంలో మిగిలి వ్యాపారాల్లాగే తన వ్యాపారానికి డిమాండ్‌ కాస్త తగ్గినట్లు వివరించింది. ముడి సరుకుల రవాణా కష్టమైంది. ముఖ్యంగా మే నెలలో అమ్మకాలు చాలా పడిపోయాయి. ప్రస్తుతం మళ్ళీ కాస్త ఆశాజనకంగా ఉందని వివరించారు.

కేవలం వ్యాపారమే కాకుండా ఇప్సిక సామాజిక సేవలపై కూడా ఆసక్తి చూపుతోంది. జీవన భృతి కోసం శ్రమిస్తున్న మహిళలకు కొత్త విధానాలు నేర్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇందుకోసం వ్యాపారంలో వస్తున్న లాభాల్లోంచి కొంత మేర ఖర్చుపెడుతున్నాను. అలాగే అనాథ పిల్లల కోసం ఆస్థా పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించినట్లు ఇప్సికా చెప్పారు. ఉన్నంతలో సేవా ఉన్నతికి అది తోవ అన్నట్టు ఇప్సిక తను ఉద్యోగం చేసే స్థాయి నుంచి పదుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది .... ఆత్మవిశ్వాసమే నన్ను మున్ముందుకు నడిపిస్తోంది అంటున్న ఇప్సికా కలలు మరింత ఫలవంతం కావాలి!!

Next Story