పొలం బాట పట్టిన ఐఐటియన్.!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  16 Aug 2020 9:55 AM GMT
పొలం బాట పట్టిన ఐఐటియన్.!

చదువు జ్ఞానాభివృద్ధికే కానీ ఉద్యోగం కోసమే కాదు. చాలా మంది కొలువులు తెచ్చుకోడానికే చదువులని భావిస్తారు. ఆ లక్ష్యంతోనే చదువుకుంటారు. అయితే కొందరు మాత్రం నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారులు వెతుక్కొంటారు. వారే చరిత్ర సృష్టిస్తారు. సాయిగోలె ఈ తరహా యువతి. మద్రాసులో ఐఐటీ చదివిన సాయిగోలె విద్యార్థి దశలోనే కొత్తగా ఆలోచించడం ప్రారంభించింది.

సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌లో ఓ స్టార్టప్‌ ప్రారంభించాలని కలలుగంది. అన్నదాతలకు అండగా ఈ స్టార్టప్‌ ఉండాలని భావించింది. సాంకేతిక సాయంతో రైతుల సమస్యలు పరిష్కరించే వీలుందా అని శోధించాలనుకుంది. తన సహ విద్యార్థి సిద్ధార్థ్‌ దియ‌లానితో ఆలోచనల్ని పంచుకుంది. తనకూ వ్యవసాయమంటే ఆసక్తి ఉండటంతో ఇద్దరు కలిసి లీన్‌ ఆగ్రి పేరిట స్టార్టప్‌ ప్రారంభించారు. భూసార పరీక్షలు నిర్వహించి ఏ నేలకు ఏ పంట అనుకూలమో తెలియజేయడం ఈ స్టార్టప్‌ లక్ష్యంగా నిర్ణయించారు. అయితే ఇంతలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలో జాబ్‌ వచ్చింది. ఉద్యోగాల్లో చేరారు.

ఉద్యోగాల్లో అయితే చేరారు గానీ వారి మనసులో స్టార్టప్‌ ఆలోచనలు అలాగే ఉన్నాయి. కొన్నాళ్ళకు వారు ఉద్యోగాలు చేయడం కాదు.. స్టార్టప్‌ ప్రారంభిస్తేనే బాగుంటుందని భావించి జాబ్‌ వదలి మళ్ళీ తమ బుర్రకు పదును పెట్టడం ప్రారంభించారు. అయితే సారి మరో అడుగు ముందుకేశారు. ఎక్కడో సిటీలో కూర్చొని వచ్చిన ఆలోచనలతో స్టార్టప్‌ ప్రారంభించడం కన్నా.. పొలంలో కొన్నాళ్లుంటే రైతుల కష్టనష్టాలు స్వయంగా తెలుసుకోవచ్చని అనకున్నారు.

గ్రౌండ్‌ రియాలిటీ కోసం పూణే సమీపంలోని సాయి కుటుంబానికి చెందిన పొలంలో సాగు ప్రారంభించారు. నీళ్ళలో దిగితేనే కదా లోతు తెలిసేది. పొలంలో దిగి అరక పట్టాక అసలు కష్టమేంటో తెలిసొచ్చింది ఇద్దరికి. అన్నదాతలు ఎదుర్కొనే సమస్యలు చాలా ఉంటాయని అర్థమైంది ఇద్దరికి. పంట పంటకీ సాగు మారుతుందనీ, దాన్ని అనుసరించే కొత్త సమస్యలూ పుట్టుకొస్తాయని స్వయంగా తెలుసుకున్నారు.

పొలం సమస్యలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాక వాటిని పరిష్కరించే వేదికగా తమ స్టార్టప్‌ను తీర్చిదిద్దారు. ఈసారి దాని పేరు కూడా భారత్‌ అగ్రి గా మార్చారు. 217లో పూణే హెడాఫీసుగా ఈ స్టార్టప్‌ పునఃప్రారంభమైంది. అదే సంవత్సరం ఉబర్‌ పిచ్‌ పోటీలో ఈ సంస్థ రూ.35 లక్షలు గెల్చుకుంది. ఈ సంస్థ భూసార పరీక్షలు నిర్వహించి 30 అంశాలను పరిగణనలోకి తీసుకుని పంటకు ఏయే పోషకాలు అందిస్తే బాగుంటుందో నిర్ణయిస్తుంది. పంట వేసేముందే భూసార పరీక్షలు, భూగర్భ జల పరీక్షలు నిర్వహిస్తారు. వరి,గోధుమ, పత్తి, మిరప, పసుపు, టమాటో, క్యాబేజీ తదితర పంటలకు సంబంధించి సూచనలు అందజేస్తున్నారు. రైతులకు మెసేజ్, ఫోన్‌ కాల్స్, ఇంటరాక్టివ్‌ వాయిస్‌ ద్వారా సలహాలు అందిస్తున్నారు.

భారత్‌ అగ్రి సూచనలు పాటించడం వల్ల పంటలకు పెట్టుబడి చాలావరకు తగ్గిందని స్వయాన రైతులే చెబతున్నారు. ఈ విజయోత్సాహంతో రైతులకు మరిన్ని సేవలందించే నిమిత్తం యాప్‌ను తీసుకొచ్చారు. వాతారణ మార్పును గమనించి రైతలకు సలహాలు ఇస్తున్నారు. విత్తనం విత్తింది మొదలు పంట చేతికొచ్చే దాకా పలు దశల్లో అన్నదాతలక ఈ యాప్‌ అండగా నిలుస్తోంది. విలువైన సలహాలు అందిస్తోంది.

రైతులు చీడపీడల ఫొటోలు పంపితే చాలు నివారణ మార్గాలను వివరిస్తున్నారు. కేవలం పొలం వరకే కాకుండా రైతలకు ఆర్థిక సలహాలు ఇస్తున్నారు. బ్యాంకులు, బీమా సంస్థలు, విత్తన సంస్థలు, పంట కొనుగోలు కేంద్రాలను రైతలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రైతులకు భారత్‌ అగ్రి బాసటగా నిలుస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, ప్రపంచబ్యాంకు ద్వారా అయిదేళ్లపాటు వెయ్యిమంది రైతులతో పనిచేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇప్పుడు చెప్పండి.. సాయిగోలె, ఆమె స్నేహితుడు అందరిలాగా ఉద్యోగంలో సర్డుకుని ఉంటే.. ఆర్థికంగా వారి వ్యక్తిగత జీవితం బాగా ఉండేదేమో గానీ, ఈ స్టార్టప్‌ ద్వారా లభించినంత సంతృప్తి అయితే దక్కేది కాదు. అందుకే మనసులాగే మెదడకు కాస్త స్వేచ్చనివ్వాలి. అది సూచించే ఆలోచనలను గౌరవించాలి, వీలు కుదిరితే అమలు చేయాలి!!

Next Story