ఆన్‌లైన్ క్లాసులు ఎంచుకున్నందుకు అమెరికాను వీడాల్సిందే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2020 7:22 AM GMT
ఆన్‌లైన్ క్లాసులు ఎంచుకున్నందుకు అమెరికాను వీడాల్సిందే..!

విదేశాల నుండి వచ్చి అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎవరికైతే ఆన్ లైన్ క్లాసులు కేటాయించారో వారు అమెరికాను వీడాల్సిందేనంటూ సంచలన నిర్ణయం తీసుకుంది ట్రంప్ సర్కారు. యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఓ ప్రకటనను విడుదల చేస్తూ ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్నవారు దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది.

నాన్ ఇమిగ్రెంట్ ఎఫ్-1, ఎం-1 విద్యార్థులు, స్కూళ్లకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులు వెళ్లిపోవాలని ఐసీఈ ఆదేశించింది. నిబంధనలను పాటించని విద్యార్థులు, తమ స్వదేశాలకు తిరిగి వెళ్లకుంటే, వారిపై చట్టపరమైన ఇమిగ్రేషన్ కేసులు నమోదు చేస్తామని..

పూర్తి ఆన్ లైన్ కోర్సులను నిర్వహిస్తున్న స్కూళ్లలో తమ పేర్లను నమోదు చేసుకున్న వారిని ఎవరినీ దేశంలో ఉంచబోమని.. ఈ తరహా వీసాలను తీసుకున్న వారిని యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ విభాగం దేశంలోకి అనుమతించదని తెలిపారు.

సరికొత్త ఆర్డర్ కారణంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. అమెరికన్ కౌన్సిల్ ఆన్ ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ బ్రాడ్ ఫార్న్స్ వర్త్ మాట్లాడుతూ ఈ నిర్ణయం విద్యార్థులను ఎంతో అయోమయానికి గురిచేస్తుందని.. ఈ విద్యా సంవత్సరం తాము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి విద్యార్థుల్లో నెలకొందని.. అమెరికాను వీడి వేరే దేశాల్లోని యూనివర్సిటీ విద్యాభ్యాసం చేయడానికి విద్యార్థులు మొగ్గు చూపే అవకాశం ఉందని ఆయన అన్నారు.

2018-19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 10 లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు యూఎస్ లో విద్యాభ్యాసం కోసం దరఖాస్తు చేసుకుని, ప్రభుత్వ అనుమతితో అక్కడ చదువుకుంటున్నారు.. ఇప్పుడు వీరు చదువుతున్న సంస్థలు ఆన్ లైన్ విధానాన్ని ఎంచుకున్నాయా.. లేక క్లాసులకు అటెండ్ అయ్యే అవకాశం ఇస్తున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.



అమెరికాలో చదువుతున్న విద్యార్థులను సొంత దేశాలకు పంపించాలంటే కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వీలు పడేలా లేదు. కొన్ని దేశాలు ట్రావెల్ బ్యాన్ విధించడంతో వీరు సొంత దేశాలకు చేరుకోవడం ఎలా అన్నది కూడా ఆలోచించాలి. మరి కొందరు విద్యార్థులకు ఆర్థికంగా కూడా పలు సమస్యలు ఉన్నాయని ఇప్పుడు వెళ్లి, మళ్లీ తిరిగి రావాలి అంటే ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తూ ఉన్నారు.

Next Story