కర్ఫ్యూ ఎత్తివేశారు.. సౌదీ అరేబియా, యుఏఈలలో వైరస్ వ్యాప్తి ఎలా ఉందంటే..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 July 2020 6:07 AM GMT
కర్ఫ్యూ ఎత్తివేశారు.. సౌదీ అరేబియా, యుఏఈలలో వైరస్ వ్యాప్తి ఎలా ఉందంటే..?

దుబాయ్: సౌదీ అరేబియాలో కూడా కరోనా వైరస్ విపరీతంగా పెరుగుతూ ఉండడంతో అక్కడి అధికారులను కలవరపెడుతోంది. సౌదీ అరేబియాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 200000 లను దాటింది. పక్కనే ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కేసుల సంఖ్య 50000ను తాకింది. గత నెలలో ఈ రెండు అరబ్ దేశాలలో కర్ఫ్యూను పూర్తిగా ఎత్తి వేశారు.

కమర్షియల్ బిజినెస్, పబ్లిక్ ప్రాంతాలు మార్చి నెల మధ్యలో నుండి మూసివేశారు. కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేయడంతో ప్రజలు కూడా బయటకు వస్తున్నారు. మిగిలిన గల్ఫ్ దేశాలైన కువైట్ లో పాక్షికంగా కర్ఫ్యూను విధించారు. ఖతర్, బహ్రెయిన్, ఒమన్ లలో కర్ఫ్యూను అసలు అమలు చేయడం లేదు.

గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియాలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. 2,05,929 కేసులు శనివారం నాటికి నమోదవ్వగా, 1858 మరణాలు సంభవించాయి. సగటున ప్రతి రోజూ 4000 కేసులు అక్కడ నమోదవుతూ ఉన్నాయి. మే నెలలో యుఎఈలో 300 నుండి 400 కేసులు సగటున నమోదవుతూ ఉండగా శుక్రవారం నాడు 600కు పైగా కేసులు, శనివారం నాడు 700కు పైగా కేసులు నమోదయ్యాయి.

టూరిజం, బిజినెస్ హబ్ అయిన దుబాయ్ ను ఇతర దేశస్థుల కోసం జులై 7 నుండి ఓపెన్ చేస్తున్నారు. దీంతో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తూ ఉన్నారు. ఖతర్ లో కూడా రీజనల్ ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలో సగటున 2000 కోవిద్-19 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. గత శనివారం నాడు 500 కేసులు నమోదయ్యాయి. మొత్తం 100000 కేసులు ఖతర్ లో నమోదయ్యాయి.

ఒమన్ హెల్త్ మినిస్టర్ పెరుగుతున్న కేసులపై ఆందోళనను వ్యక్తం చేశాడు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఇరాన్ లో కరోనా వైరస్ మరణాలు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. 237878 కేసులు శనివారం నాటికి ఇరాన్ లో నమోదవ్వగా, 11,408 మంది చనిపోయారు. దీంతో ఇరాన్ లో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది.

Next Story