మన వాళ్లకు మంచి జరిగేనా.. హెచ్-1బీ వీసా నిబంధనల్ని సడలించిన  అమెరికా

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 8:08 AM GMT
మన వాళ్లకు మంచి జరిగేనా.. హెచ్-1బీ వీసా నిబంధనల్ని సడలించిన  అమెరికా

హెచ్-1బీ వీసా నిబంధనల్ని అమెరికా ప్రభుత్వం సడలించింది. కొద్దిరోజుల కిందట.. హెచ్-1బీ వీసాలపై ట్రంప్ సర్కారు నిషేధం విధించడంతో భారత్ కు చెందిన చాలా మంది ఆశావహులు ఆశలను వదిలేసుకున్నారు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకించారు. తాజాగాహెచ్-1బీ వీసాల విషయంలో కొన్ని మినహాయింపుల్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్-1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు.

హెచ్-1బీ, ఎల్1 లాంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా అమెరికాలోకి రావడాన్ని ఈ ఏడాది చివరి వరకు నిషేధిస్తూ జూన్ 22న ట్రంప్ స‌ర్కార్‌ నిర్ణయం తీసుకున్న నిర్ణయంపై మాత్రమే యూఎస్‌ సడలింపులు ఇచ్చింది.

హెచ్-1బీ వీసాల ద్వారా అందర్నీ అమెరికాలోకి అనుమతించరు. హెచ్-1బీ వీసాలపై నిషేధం విధించడానికన్నా ముందు అమెరికాలో ఉద్యోగాలు ఉన్నవారికి మాత్రమే తిరిగి అమెరికాలోకి అనుమతివ్వనుంది ట్రంప్ ప్రభుత్వం. హెచ్-1బీ, ఎల్1 వీసాలు ఉన్నవారికే ఇది వర్తిస్తుందని తెలిపింది. వీసాలపై నిషేధం విధించడం కన్నా ముందు.. అమెరికాలో ఉద్యోగాలు ఉన్న వాళ్ళు తిరిగి ఆ ఉద్యోగాల్లోనే పనిచేసేందుకు వస్తేనే వారికి అమెరికా రావడానికి అనుమతి ఉంటుంది.

ఉద్యోగులతో పాటు వారి జీవితభాగస్వాములు, పిల్లలకు కూడా అనుమతి ఉంది. హెచ్-1బీ వీసా ఉన్న టెక్నికల్ స్పెషలిస్ట్, సీనియర్ లెవెల్ మేనేజర్ లాంటి ఉద్యోగులను, పబ్లిక్ హెల్త్ లేదా హెల్త్‌కేర్ సిబ్బంది, మెడికల్ రీసెర్చర్ లాంటివారికి అనుమతిస్తోంది.

అమెరికాలోని కంపెనీల్లో ప్రత్యేక పోస్టుల్లో విదేశీయులు తాత్కాలికంగా పనిచేయాలంటే హెచ్-1బీ నాన్ ఇమ్మిగ్రంట్ వీసా తీసుకోవడం తప్పనిసరి. అమెరికాలోని కంపెనీలు వర్క్ వీసాలాగా హెచ్-1బీ వీసాలను ఆఫర్ చేస్తుండగా.. భారతదేశం నుంచి వేలాది మంది హెచ్-1బీ వీసాలతో వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన సడలింపులు మన వారికి మేలు చేయనుంది.

నేషనల్ ఇంట్రెస్ట్ కేటగిరీ కింద స్టేట్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని బుధవారం నాడు తెలిపింది. ఇంతకు ముందు హెచ్-1, ఎల్-1 కింద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు తమ ఉద్యోగాలను చేసుకోవచ్చని తెలిపారు.

Next Story