కమల హారిస్ ను ప్రకటించడంపై.. ట్రంప్ వ్యాఖ్యలు విన్నారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 1:37 AM GMT
కమల హారిస్ ను ప్రకటించడంపై.. ట్రంప్ వ్యాఖ్యలు విన్నారా..?

అమెరికా ఉపాధ్యక్ష రేసులో భారత సంతతి మహిళ కమలా హారిస్ నిలిచిన సంగతి తెలిసిందే. డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్, ఉపాధ్యక్ష పదవికి కాలిఫోర్నియా సెనెటర్ కమలా హారిస్ పేరును ప్రతిపాదించడంతో భారతీయులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పలువురు ప్రముఖులు కూడా కమలా హారిస్ గొప్ప మనిషి అంటూ ప్రశంసలు గుప్పించారు.

కమల హారిస్ ను ఉపాధ్యక్ష పదవికి ప్రకటించడంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించిన తీరు ఆడవాళ్లను కించపరిచే విధంగా ఉందని పలువురు సామాజిక మాధ్యమాల్లో చెప్పుకొచ్చారు. ఒక మహిళను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేయబోయే అభ్యర్థిగా బిడెన్ ఎంచుకుకోగా.. అది కొందరు పురుషులు అవమానంగా భావించే అవకాశం ఉందని అన్నారు. బిడెన్ ఒక వర్గానికి వ్యతిరేకిగా మారిపోయారని.. పురుషులకు అవమానం జరిగిందని కొందరు అనొచ్చని ట్రంప్ చెబుతూ ఉన్నారు. బిడెన్ సరైన నిర్ణయం తీసుకున్నారని మరికొందరు అనొచ్చంటూ నోటికి వచ్చిన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ నుండి ఇంతకంటే గొప్ప మాటలు ఏమొస్తాయంటూ పలువురు వ్యాఖ్యానించారు.

అమెరికాలో ఫియర్ లెస్ లేడీగా గుర్తింపు పొంది, దేశంలోని అద్భుతమైన ప్రజా సేవకుల్లో ఒకరైన కమలా హారిస్ పేరును తాను ఉపాధ్యక్ష పదవికి ప్రతిపాదించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని బిడెన్ తెలిపారు. తన పేరును వైస్ ప్రెసిడెంట్ పదవికి నామినేట్ చేయడం తనకు దక్కిన గౌరవమని కమలా హారిస్ అన్నారు. బిడెన్ అడుగుజాడల్లో నడుస్తానని అన్నారు. అమెరికా ప్రజలను జో బిడెన్ ఒకే మాట, ఒకే బాటపై నడిపించగలరు. తన జీవితకాలం పాటు ఆయన అమెరికా కోసం శ్రమించారు. ఆయన అధ్యక్షుడైతే అమెరికా మరో మెట్టెక్కుతుందని కమలా హారిస్ ట్వీట్ చేశారు.

Next Story