లెబనాన్ ను దేవుడే రక్షించాలి అంటూ రాజీనామా చేసిన ప్రధానమంత్రి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Aug 2020 5:43 AM GMT
లెబనాన్ ను దేవుడే రక్షించాలి అంటూ రాజీనామా చేసిన ప్రధానమంత్రి

లెబనాన్ రాజధాని బీరూట్ లో చోటుచేసుకున్న భారీ విధ్వంసం ఆ దేశ రాజకీయాలను కూడా కుదిపేస్తోంది. లెబనాన్ లో ఎన్నో ఏళ్లుగా అవినీతి రాజ్యమేలుతోందని పెద్ద ఎత్తున దేశ ప్రజలు నిరసనలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీరూట్ విధ్వంసంలో కూడా ప్రభుత్వం సరిగా పనిచేయకపోవడమే కారణమని చెబుతూ ఉన్నారు. రాజకీయంగా కూడా ఒత్తిడి రావడంతో లెబనాన్‌ ప్రధాని హసన్‌ దియాబ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

బీరూట్ విధ్వంసం కారణంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో ముగ్గురు మంత్రులు రాజీనామా చేయడంతో తాను కూడా రాజీనామా చేయాలని ప్రధాని హసన్‌ నిర్ణయించుని తన రాజీనామాను సమర్పించారు. 'ప్రభుత్వం కన్నా అవినీతి శక్తిమంతమైందని తేలిందని.. ప్రజలతో కలిసి మార్పుకోసం పోరాడుతాను.. ఈ రోజు నా ప్రభుత్వం రాజీనామా చేస్తోంది.. దేవుడే లెబనాన్ ను రక్షించాలి' అని ఆయన అన్నారు.

బీరూట్ షిప్ యార్డ్ లోని అమ్మోనియం నైట్రేట్ నిల్వల వలన భారీ ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని నెల క్రితమే హెచ్చరించినా కనీసం అటువైపుగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. పోర్టులో ఉన్న 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ నిల్వల వల్ల రాజధాని బీరుట్‌కు ప్రమాదం పొంచి ఉందని సెక్యురిటీ వర్గాలు నెల క్రితమే హెచ్చరించాయి. సెక్యురిటీ వర్గాల హెచ్చరికలకు సంబంధించిన పత్రాలను కొందరు సీనియర్‌ భద్రతా అధికారులు పరిశీలించినప్పటికీ ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోకపోవడంతో ఆ దేశ ప్రజలు ఎంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

2013 నుంచి గోడౌన్లలో ఉన్న అమ్మోనియం నైట్రేట్‌తో బీరుట్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని అధ్యక్షుడు మిచల్‌ అవున్‌, ప్రధాని హసన్‌ డియాబ్‌కు జులై 20న లేఖ కూడా రాశారట.. ఆ విషయాన్ని చెవుల్లో కూడా వేసుకోలేదు. అమ్మోనియం నైట్రేట్‌ నిల్వలు తీవ్రవాదులు దొంగిలించి మారణహోమం సృష్టించే అవకాశం ఉందని నేషనల్‌ సెక్యురిటీ జనరల్ హెచ్చరించారు. పొరపాటున పేలుడు జరిగినా కూడా బీరూట్ నగరం సర్వనాశనం అవుతుందని చెప్పిన కొద్దిరోజులకే ఈ భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఏది ఏమైనా ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే ప్రధాని రాజీనామా చేయక తప్పలేదు.

Next Story