వైట్‌హౌస్ బయట కాల్పుల కలకలం.. మీడియా సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన ట్రంప్
By తోట వంశీ కుమార్ Published on 11 Aug 2020 6:31 AM GMTవైట్‌హౌస్ బయట కాల్పులు కలకలం రేపాయి. అదే సమయంలో మీడియా సమావేశంలో ఉన్న అమోరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా ముగించారు. ఈ ఘటన స్థానిక కాలమానం సోమవారం సాయంత్రం 5.50 గంటలకు జరిగింది. వివరల్లోకి వెళితే.. పెన్సిల్వేనియా అవెన్యూలోని 17వ వీధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరిపారు. దుండగుడు మారణాయుధాలు ధరించి ఉన్నాడని వారు తెలిపారు. ఆ సమయంలో ట్రంప్ మీడియా సమావేశంలో ఉన్నారు. తుపాకీ శబ్ధం వినిపించడంతో.. ఎస్కార్ట్స్ బృందం, ట్రంప్ ను చుట్టుముట్టి, అక్కడి నుంచి తీసుకెళ్లింది.
జరిగిన ఘటనపై వాషింగ్టన్ డీసీ అగ్నిమాపక శాఖ ప్రతినిధి డౌగ్ బుచానన్ వివరణ ఇస్తూ, "సోమవారం సాయంత్రం 5.55 గంటల సమయంలో సీక్రెట్ సర్వీస్ విభాగం నుంచి ఓ ఫోన్ వచ్చింది. సెక్యూరిటీ ఆఫీసర్ ఒకరు ఓ వ్యక్తిని శరీరం పైభాగంలో కాల్చాల్సి వచ్చిందని చెప్పారు. ఆ వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించాం" అని అన్నారు.
ప్రెస్ కాన్ఫరెన్స్ నుంచి మధ్యలో వెళ్లిపోయిన ట్రంప్.. ఆ తర్వాత తిరిగి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఎదురు కాల్పులలో గాయపడగా, అతనిని ఆసుపత్రికి తరలించారని ట్రంప్ తెలిపారు. ఈ ఉదంతంలో వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ అధికారులకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.