ఆగస్ట్‌ 12న తొలి వ్యాక్సిన్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2020 9:40 AM GMT
ఆగస్ట్‌ 12న తొలి వ్యాక్సిన్..!

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1.9కోట్ల మంది ఈ మహమ్మారి భారిన పడగా.. 7.2లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి విజృంభణ మొదలై ఆరు నెలలు దాటింది. అయినా ఇప్పటి వరకు ఈ మహమ్మారికి మందును కనిపెట్టలేదు. ఈ వైరస్‌కు మందును కనిపెట్లే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే క్లినికల్‌ ట్రయల్స్‌ మొదలు అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఈ నెల 12 నుంచి వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ఓలెగ్‌ గృందేవ్‌ ప్రకటించారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆరోజు జరగనుందని తెలిపారు. టీకాను గమలేయ రీసెర్చ్ ఇన్స్‌స్టిట్యూట్‌, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఉఫా నగరంలో క్యాన్సర్ సెంటర్ భవనాన్ని ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు.

‘గమలేయ ఇన్స్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ప్రస్తుతం చివరి దశ ట్రయల్స్‌లో ఉంది. ఈ దశ ట్రయల్స్ చాలా ముఖ్యమైనది. వైరస్‌ బారినపడిన వారిలో రోగ నిరోధక శక్తి పెరిగితే టీకా సురక్షితమని అర్థం చేసుకోవాలి’ అని ఒలేగ్ స్పష్టం చేశారు. తొలిదశలో వైద్య నిపుణులు, సీనియర్ సిటిజన్లకు టీకాలు వేస్తామని చెప్పారు. టీకా క్లినికల్ ట్రయల్స్ జూన్ 18న ప్రారంభమయ్యాయని, 38 మంది వాలంటీర్లకు టీకా ఇవ్వగా వారందరిలో రోగనిరోధక శక్తి పెరిగిందని ఆయన వెల్లడించారు. కాగా.. ఈ ప్రకటనతో శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. పూర్తి స్థాయి ట్రయల్స్ తర్వాతే విడుదల చేయాలని సూచిస్తున్నారు. రష్యా ప్రకటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన అన్ని రకాల గైడ్‌లైన్స్‌ ఫాలో అవ్వాల్సిందేనని సూచించింది.

Next Story