కరోనా వైరస్‌: యూపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  28 March 2020 7:33 PM IST
కరోనా వైరస్‌: యూపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో కేంద్ర సర్కార్‌ లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఎక్కడికక్కడ ఉన్నవారు తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. రోడ్లపై ఎటువంటి వాహనాలు, జనాలు తిరగకుండానే పోలీసులు కట్టదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా సరిహద్దు జిల్లాలో చిక్కుకుపోయిన వలస కార్మికులను తీసుకెళ్లేందుకు యోగి సర్కార్‌ వెయ్యి బస్సులను ఏర్పాటు చేసినట్లు యూపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శనివారం తెలిపారు.

నోయిడా, ఘజియాబాద్‌, బులంద్‌షహార్‌, అలీఘర్‌ తదితర ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులకు తాగునీరు, ఆహారం వంటి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ అదికారుల ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి జరిపిన సమీక్షలో వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో రవాణాశాఖ అధికారులు డ్రైవర్లు, కండక్టర్లతో సంప్రదించినట్లు అధికారులు తెలిపారు.

ఇక దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14 వరకు పొడిగిస్తూ ఈనెల 24న ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారత్‌లో కరోనాతో 21 మంది మృతి చెందగా, 800లకుపైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో శనివారం తొలి కరోనా మరణం సంభవించింది. ఇప్పటి వరకు తెలంగాణలో 65 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజు 10 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శనివారం ఆరు కేసులు నమోదయ్యాయి. ఒక కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌ రాగా, మరో కుటుంబంలో నలుగురికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది.

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వేలల్లో మృతి చెందగా, లక్షల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికాను సైతం కరోనా వెంటాడుతోంది. లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2వేల వరకు మృతి చెందారు.

Next Story