వీరేంద్రను పెళ్లి చేసుకోవడం కోసం.. 80 కిలోమీటర్లు నడిచిన గోల్డి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 12:52 PM GMT
వీరేంద్రను పెళ్లి చేసుకోవడం కోసం.. 80 కిలోమీటర్లు నడిచిన గోల్డి..!

ఉత్తరప్రదేశ్ కు చెందిన 20 సంవత్సరాల యువతి పెళ్లి చేసుకోవడం కోసం ఏకంగా 80 కిలోమీటర్లు నడిచి వెళ్ళింది. కాన్పూర్ నుండి సదరు యువతి.. పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఉన్న కన్నువాజ్ ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్ళింది. వీరి పెళ్లి మే 4న పెద్దలు నిర్ణయించగా.. లాక్ డౌన్ కారణంగా పొడిగించారు.

20 సంవత్సరాల వధువు గోల్డి, 23 సంవత్సరాల వరుడు వీరేంద్ర కుమార్.. మార్చి నెలలో లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుండి మొబైల్ ఫోన్ లో టచ్ లోనే ఉన్నారు. వాహనాల రాకపోకలు అన్నవి అందుబాటులో లేకపోవడంతో చాలా బాధపడ్డారు. మార్చి నెల నుండి పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ ఉండగా వాయిదా పడుతూ వచ్చింది. రెండు సార్లు ముహూర్తం పెట్టగా.. రెండు సార్లు వాయిదా పడింది అని చెబుతున్నారు.

బుధవారం మధ్యాహ్నం కాన్పూర్ దగ్గర ఉన్న లక్ష్మణ్ పూర్ తిలక్ గ్రామం నుండి కన్నూజ్ దగ్గర ఉన్న వీరేంద్ర కుమార్ సొంత ఊరైన బైసాపూర్ గ్రామానికి నడుచుకుంటూ వచ్చేసింది. దాదాపు 80 కిలోమీటర్లు ఆమె నడిచేసింది. పెళ్లి కూతురు గోల్డి నడుచుకుంటూ వచ్చేస్తోంది అని తెలుసుకున్న పెళ్లి కొడుకు కుటుంబం అక్కడి ఓ గుళ్లో పెళ్లి ఏర్పాట్లను పూర్తీ చేశాయి. ఇంతలో గోల్డి అక్కడి చేరుకోవడం.. వారిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ ను పాటిస్తూ.. వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మాస్కులతో కనిపించారు. వధువు ఎరుపు రంగు చీరలో కనిపించగా.. వరుడు తెలుపు రంగు షర్టు, డెనిమ్ జీన్స్ లో కనిపించాడు. ఆ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త కూడా ఈ పెళ్ళికి హాజరయ్యాడు.

లాక్ డౌన్ కారణంగా కొన్ని వేల పెళ్లిళ్లు తెలుగు రాష్ట్రాల్లో రద్దయ్యాయి. కొందరు ప్రభుత్వం అనుమతి తీసుకుని తక్కువ మంది సమక్షంలో వివాహాలను కానిచ్చేశారు. కొందరు ఏకంగా వీడియో కాల్స్ లోనే పెళ్లిళ్లు చేసుకున్న ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 5700 మంది ఇప్పటిదాకా కరోనా వైరస్ బారిన పడ్డారు. 130 మంది దాకా చనిపోయారు.

Next Story