ఆ రాష్ట్ర సీఎం ఇంట్లోనే సరిగా కరెంట్ లేదట.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 May 2020 9:41 AM GMT
ఆ రాష్ట్ర సీఎం ఇంట్లోనే సరిగా కరెంట్ లేదట.!

ప్రకృతి ప్రకోపం ఎంత ఎక్కువగా ఉంటుందో తాజాగా పశ్చిమబెంగాల్ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అంఫాన్ తుపాను దెబ్బకు బెంగాల్ రాష్ట్రం అతలాకుతలమైంది. తుపాను తీవ్రతకు మమతా బెనర్జీ సర్కారు కిందామీదా పడుతోంది. గడిచిన రెండు రోజులుగా పరిస్థితిని మామూలు స్థితికి తెచ్చేందుకు రేయింబవళ్లు ప్రయత్నిస్తున్నా.. ఫలితం ఉండటం లేదు. దీంతో బెంగాలీల్లో ఆగ్రహం కట్టలు తెగుతోంది. ప్రజలు సంయమనం పాటించాలని ఆమె కోరుతున్నారు.

కోల్ కతా లోని సీఎం మమత ఇంట్లోనూ విద్యుత్ సరఫరా లేదంటే.. మహానగర పరిస్థితి మరెంత దారుణంతో ఉందో ఇట్టే అర్థమైపోతుంది. తుపాను కారణంగా చోటు చేసుకున్న విధ్వంసంతో విలవిలలాడుతున్న ప్రజల్ని ఆదుకోవటంలో దీదీ సర్కార్ ఫెయిల్ అయ్యిందన్న మాట సర్వత్రా వినిపిస్తున్న వేళ.. ఆమె తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

సహాయక చర్యలు సరిగాలేవంటూ మీడియా ప్రతినిధులు మమతను ప్రశ్నిస్తే ఆమె ఆవేశంతో ఊగిపోతున్నారు. తానేం మాట్లాడుతున్నది ఆమెకైనా అర్థమవుతుందా? అన్నది ప్రశ్నగా మారింది. ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది కదా? అన్న ప్రశ్నకు.. అయితే.. నా తల నరకమనండి అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.

పరిస్థితి చక్కబడేందుకు మరికొంత సమయం పడుతుందని.. వీలైనంతవరకు సాధారణ పరిస్థితికి తెచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పాటుపడుతున్నట్లు ఆమె చెబుతున్నారు. ఇంతకూ అంఫాన్ కారణంగా బెంగాల్ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి నెలకొందన్న విషయంలోకి వెళితే.. కొన్నేళ్ల క్రితం విశాఖను అతలాకుతలం చేసిన హుధూద్ తుపాను గుర్తుకు తెచ్చేలా పరిస్థితి ఉంది. తుపాను గాలి ధాటికి చాలాచోట్ల కరెంటు వైర్లపై చెట్లు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.

కోల్ కతా మహానగరం గడిచిన మూడు రోజులుగా చీకట్లోనే మగ్గుతోంది. చాలా తక్కువ ప్రాంతాల్లోనే విద్యుత్ సరఫరా అవుతోంది. మధ్య మధ్యలో ఆటంకాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా.. సహాయక చర్యల్ని పరుగులు తీయించలేకపోతున్నారు. తమకు ఎదురవుతున్న కష్టాలతో ప్రజల్లో చిరాకు పెరిగి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికల పరీక్షను ఎదుర్కోనున్న దీదీ తాజాగా తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

Next Story
Share it