అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0.. సడలింపులు ఇవే..!
By సుభాష్ Published on 28 Sep 2020 9:00 AM GMTదేశంలో కరోనా నేపథ్యంలో అన్‌లాక్ 4.0 కొనసాగుతోంది. సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 ముగిసి, అక్టోబర్ 1 నుంచి అన్‌లాక్ 5.0 ప్రారంభం కానుంది. ఈ దీనిపై రేపో, ఎల్లుండో మార్గదర్శకాలు విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. గతంతో పోలిస్తే మరిన్ని సడలింపులు ఉంటాయని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇటీవల వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ.. మైక్రో-కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు ఆలోచనను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వల్ప కాల వ్యవధి లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలను విధించాలని కూడాఆయన ముఖ్యమంత్రులకు సూచించారు.
కాగా, భారత్‌లో దసరా-దీపావళి పండగ సీజన్ మొదలు కానుంది. ఆపై వెంటనే క్రిస్మస్ వేడుకలు ఉంటాయి.ఈ నేపథ్యంలోమరిన్ని నిబంధనలను సడలించడం ద్వారా ప్రజలు యాక్టివిటీని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం ఇవ్వవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అన్‌లాక్ 5.0కు సంబంధించి మార్గదర్శకాలను తయారు చేస్తున్నట్లు సమాచారం.
అన్‌లాక్ 50.లో భాగంగా సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బార్లు, క్లబ్బులు తెరుచుకున్నాయి. అలాగే బస్సులు కూడా రోడ్లెక్కాయి. అంతర్ రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక అక్టోబర్ 1 నుంచి సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
కేంద్ర హోంశాకకు సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అమిత్ కారే ఓ లేఖ రాశారు. నిబంధనలకు అనుగుణంగా సినిమా హాల్స్ తెరిచేందుకు అనుమతించాలని గతంలో రాసిన లేఖ రాశారు. సీట్ల సీట్లకు మధ్య ఖాళీ వదిలిపెడుతూ, 50 శాతం కన్నా తక్కువ ప్రేక్షకులతో సినిమాలను ప్రదర్శించుకునేందుకు అన్‌లాక్ 5.0లో అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజం రంగంలో కూడా ఈ అన్‌లాక్ 5.0లో భారీగానే సడలింపులు ఉండే అవకాశం కనిపిస్తోంది. పర్యాటకులకు స్వాగతం పలికేందుకు అన్ని టూరిజం సెంటర్లు కూడా తెరుచుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లో టూరిస్టులకు అనుమతి
కాగా, ఉత్తరాఖండ్ టూరిస్టులను స్వాగతిస్తోంది. ఎలాంటి కోవిడ్ రిపోర్టులు, క్వారంటైన్ లేకుండానే తమ రాష్ట్రానికి పర్యాటకులు రావచ్చని కొన్ని రోజుల కిందటనే ఆదేశాలు జారీ చేసింది. ఇక అక్టోబర్ నుంచి విద్యాసంస్థలకు కూడా మరిన్ని సడలింపులు ఉంటాయని,ఈ విషయంలో మాత్రం నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని కూడా కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 9 నుంచి 12 తరగతులకు క్లాసులు కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇతర తరగతి విద్యార్థులను మరికొన్ని వారాల తర్వాత క్లాసులు ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.