లాక్‌డౌన్ నిబంధనలు.. ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు.!
By అంజి
ముఖ్యాంశాలు
- లాక్‌డౌన్ ఉల్లంఘించే వారిపై చర్యలకు కేంద్రం ఆదేశం
- రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్రాలకు తెలిపిన కేంద్రం
- చట్టపరమైన చర్యలు తీసుకోండి: కేంద్ర ప్రభుత్వం
ఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసింది. ఏప్రిల్ 14 వరకు ఎవరూ కూడా బయటకు రావొద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అయిన కూడా కొందరు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి అనవసరంగా బయట తిరుగుతున్నారు. అలాంటి వారిపై కొరడా ఝులిపించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనల ఉల్లంఘన, తప్పుడు ప్రకటనలు చేసేవారిపై భారతీయ శిక్షాస్మృతి, విపత్తు నిర్వహసణ చట్టం-2005 యాక్ట్‌ల కింద కేసులు నమోదు చేయవచ్చని రాష్ట్రా ప్రభుత్వాలకు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.
ఏ నిబంధన ఉల్లంఘిస్తే ఏ చర్య తీసుకోవాలో సూచిస్తూ జాబితా పంపారు. లాక్‌డౌన్‌ను అడ్డుకునే వారికి రెండేళ్లు జైలు శిక్ష విధించే అవకాశాముందని తెలిపింది. అలాగే తప్పుడు ప్రకటనలు చేసే వారికి కూడా రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చని తెలిపారు. లాక్‌డౌన్ మార్గదర్శకాలు మార్చి 24న జారీ అయ్యాయి. వీటిని ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం 2005 చట్టంలోని 51 సెక్షన్ నుంచి 60 సెక్షన్ వరకు అన్నీ వర్తిస్తాయని కేంద్రం తెలిపింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది.