అందరూ ఎల్వీలా ఉండరు.. నిమ్మగడ్డ లాంటోళ్లు ఉంటారు... ఏంటి దీనర్థం?
By న్యూస్‌మీటర్ తెలుగు
ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అందరికి సాధ్యం కాదు. అందులోనూ చేతిలో తిరుగులేని అధికారం ఉన్న నేత.. అందునా.. ఏం చెబితే.. ఏం జరుగుతుందో? అన్న సందేహం ఉన్న వేళ.. అభిప్రాయాన్ని చెప్పటం అంత తేలికైన విషయం కాదు. అందునా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మరింత కష్టం. ఎందుకంటే.. అప్రియమైన మాటలు.. ఆయనకు కానీ ఆయన పరివారానికి కానీ ఆయన అభిమాన గణానికి కోపం వచ్చే అవకాశమే ఎక్కువ.
అలాంటివేళలోనూ పెద్ద సాహసాన్నే చేశారు సీనియర్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్. ఇటీవల కాలంలో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా పలువురి మీద దూకుడుగా వ్యవహరిస్తున్న వైఎస్ జగన్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న అధినేత.. ఎలా వ్యవహరించాలన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన ఉండవల్లి.. జగన్ చేస్తున్న తప్పుల చిట్టా విప్పారు. ఎలా ఉంటే మంచిదో చెప్పే ప్రయత్నంలో కొన్ని ఆసక్తికర ఉదాహరణలు చెప్పారు. అవసరానికి అనుగుణంగా ఒకట్రెండు పంచ్ లు వేసేందుకు వెనుకాడలేదు.
వ్యవస్థలతో శత్రుత్వం మంచిది కాదన్న ఆయన.. కోర్టులు.. ఎన్నికల కమిషన్ తో గొడవేమిటని ప్రశ్నించారు. అందరూ ఎల్వీ సుబ్రహ్మణ్యంలా ఉండరని.. నిమ్మగడ్డ.. ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వారూ ఉంటారన్న ఆయన.. ప్రాక్టికల్ గా ఎవరితో ఎవరు ఎలా బిహేవ్ చేయాలనే విషయాన్ని ఉదాహరణలో చెప్పారు. విషయాలు పాతవే అయినా.. సందర్భానికి తగినట్లుగా ఆయన ప్రస్తావించటం గమనార్హం.
ఉండవల్లి చెప్పిన ఉదాహరణల విషయానికి వస్తే..
- ‘‘వీవీ గిరి రాష్ట్రపతిగా గెలిచిన వేళ.. ఆ గెలుపు చెల్లదనంటూ మరో వ్యక్తి కోర్టుకు వెళ్లారు. రాష్ట్రపతిని కోర్టుకు రప్పించటం బాగోదని.. ఆయన దగ్గరికే ఒక కమిషన్ ను పంపాలని కోర్టు భావించింది. ఇది తెలిసి ఒక రోజు వీవీ గిరి సొంత కారులో కోర్టుకు వచ్చారు. ఆయన నమస్కారం పెట్టారు. కానీ.. జడ్జిలు ఎవరూ లేవనలేదు. ఆయన నమస్కారం పెట్టింది జడ్జికి కాదు.. అక్కడి న్యాయపీఠానికి’’
- ‘‘పీవీ నరసింహారావుకు ఒక కేసులో బెయిల్ కోసం అనేక వాదనలు చేస్తుండగా.. బెయిల్ అడగకుండా వాదన చేయటం జడ్జిగారికి నచ్చలేదు. అలా చేస్తే రిమాండ్ కు పంపిస్తానని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇలాంటివేళ పీవీ ఒక లాయర్ ను పంపారు. పీవీ ప్రధానిగా చేశారు. ఆయన ఆరోగ్యం బాగా లేదు. జైలుకు పంపకండి. పిలిచినప్పుడు వస్తారని సదరు లాయర్ చెప్పిన వెంటనే ఆ జడ్జి బెయిల్ ఇచ్చారు’’
- ‘‘వంగవీటి రంగా ఒక కేసులో కోర్టుకు వెళ్లి చేతులు కట్టుకొని వినయంగా నిలబడ్డారు. అంత వినయం ఎందుకని ఆయన్ను నేను (ఉండవల్లి) అడిగాను. ఎవడీ రంగా అని జడ్జి అనుకుంటే.. సాయంత్రం వరకు అలాగే నిలబెట్టేస్తారని రంగా చెప్పారు’’