ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రివ్యూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 8:09 PM IST
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీ రివ్యూ

నటీనటులు : సత్యదేవ్, హ‌రిచంద‌న‌, రూప‌, సుహాన్‌, జ‌బర్ద‌స్త్ రాంప్ర‌సాద్,

సంగీతం: బిజ్బల్

నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని,విజ‌య ప్ర‌వీణ పరుచూరి

స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వెంకటేష్ మహా

కరోనా కారణంగా సినిమా థియేటర్లు మూతబడడంతో ప్రస్తుతం ఓటీటీలో సినిమాలను విడుదల చేస్తున్నారు. తాజాగా నెట్‌ఫిక్స్‌లో విడుదలైన మూవీ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. కేరాఫ్ కంచరపాలెం తో తనదైన ముద్ర వేసిన దర్శకుడు వెంకటేష్ మహా. రెండో సినిమాకు ఆశ్చర్యకరంగా రీమేక్ ను ఎంచుకున్నాడు. మలయాళంలో విజయవంతమైన మహేషింతే ప్రతీకారం చిత్రాన్ని సత్యదేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’గా తెరకెక్కించాడు. మరీ ఈ సినిమా ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..

కథ : మహేష్ (సత్యదేవ్) అరకులో తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చిన్న ఫొటో స్టూడియో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న ఫొటోగ్రాఫర్. గొడవలంటే ఆమడ దూరం పరిగెత్తుతాడు. తన పనేదో తాను చేసుకోవడం.. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటాడు. అతడి జీవితంలో అలజడి రేగుతుంది. ప్రేమించిన అమ్మాయి(హరిచందన) దూరమవుతుంది. ప్రేమించిన అమ్మాయి వేరే అతన్ని పెళ్లిచేసుకుంటుంది. తనకు సంబంధం లేని ఓ గొడవలో తలదూర్చి అవమానపడతాడు మహేష్‌. అందరి ముందు దారుణంగా తన్నులు తినడంతో హీరో ఆత్మభిమానం దెబ్బతింటుంది. తనను కొట్టిన వాటిని తిరిగి కొట్టేంత వరకు చెప్పులు వేసుకోనని శపథం చేస్తాడు. అదే సమయంలో తన శత్రువు చెల్లెలు జ్యోతి(రూప కొడవయూర్‌)తో ప్రేమలో పడతాడు. మహేష్‌ తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడా...? రెండో సారి అయిన ప్రేమను దక్కించుకున్నాడా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ఫ్లస్‌, మైనస్‌ పాయింట్లు :

అతి సామాన్యుడైన హీరో.. మొరటోడైన విలన్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనే సింపుల్ స్టోరీతో తెరకెక్కింది ఈ చిత్రం. పాత్రల్లో సన్నివేశాల్లో సహజత్వం తెలుగు నేటివిటీకి దగ్గరగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. సునిశితమైన హాస్యం, ఆహ్లాదకరమైన సన్నివేశాలు హృదయాన్ని తాకే మాటలతో ఒక దశ వరకు ఈ చిత్రం మంచి స్థాయిలోనే సాగుతుంది. అంద‌రి ముందు రౌడీ చేతిలో హీరో త‌న్నులు తినే కీల‌క‌ స‌న్నివేశంతో ప్రేక్ష‌కుడు క‌థ‌లో లీన‌మ‌వుతాడు. సరిగ్గా ఇదే స‌మ‌యంలో ప్రేమికురాలు బ్రేక‌ప్ చెప్తుంది. ఇక్క‌డ బ్రేక‌ప్ చెప్పిన త‌ర్వాత ప్రేమికుల ప‌రిస్థితి ఎలా ఉంటుంద‌నేది హీరోహీరోయిన్ల పాత్ర‌ల ద్వారా ఆస‌క్త‌కిరంగా మ‌లిచాడు. క‌థ‌లో ప్రేమ‌ను, అనుబంధాల‌ను ర‌మ్యంగా చూపించాడు. అయితే.. క‌థ‌ చివ‌ర్లో ఎలాంటి ట్విస్ట్‌లు, మ్యాజిక్‌లు లేకుండానే సింపుల్‌గా ముగించేశాడు.

సెకండ్‌ హాప్‌లో దర్శకుడికి చెప్పడానికి ఆసక్తికర అంశాలేవీ లేకుండా పోయాయి. ఇంటర్వెల్‌ తరువాత నెమ్మదించింది. రొమాన్స్‌ పేరిట దర్శకుడు అవసరానికి మించిన సన్నివేశాలతో నిడివి పెంచేవాడు. ఎడిటింగ్‌ వైపల్యం కూడా ఈ మూవీలో కనిపిస్తుంది. కెమెరా పని తనం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మరియు అరుకు అందాలు తెరపై ఆహ్లదం పంచుతాయి. కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు హృదయాన్ని తట్టిలేపితే.. మరికొన్ని సన్నివేశాలు పేలవంగా ప్రేక్షకుడిని అసహనానికి గురిచేస్తాయి. ఓవరాల్‌గా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ సినిమా. కాకపోతే సినిమా నిడివి, అనవసరమైన సన్నివేశాలు ఆ ఫ్యాక్టర్‌ను మింగేసిందని చెప్పవచ్చు.

సత్యదేవ్‌ నటన గురించి చెప్పాల్సి పనిలేదు. పలు రకాల ఎమోషన్స్‌ ఉన్న పాత్రను సత్యదేవ్ అవలీలగా పోషించాడు. నరేష్‌ తన ప్రాతలో జీవించాడు. ఇక హీరోయిన్లలో స్వాతిగా హరి చందన, జ్యోతిగా రూప తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకొన్నారు. గ్లామర్‌కు దూరంగా ఉంటే స్వాతి పాత్రలో హరి చందన కనిపిస్తే. గ్లామరస్‌తో కమర్షియల్ విలువలకు స్కోప్ ఉన్న జ్యోతి పాత్రలో రూప కనిపించింది.

Next Story