లిక్క‌ర్ కింగ్ మాల్యా కేసులో ఊహించని ట్విస్ట్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  6 Aug 2020 10:31 AM GMT
లిక్క‌ర్ కింగ్ మాల్యా కేసులో ఊహించని ట్విస్ట్.!

లిక్క‌ర్ కింగ్‌ విజయ్ మాల్యా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో నేడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన కేసుకు సంబంధించిన పత్రాల్లో ఒకటి క‌నిపించ‌క‌పోవ‌డంతో.. దీంతో విచార‌ణను‌ ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ యూ.యూ. లలిత్, జస్టిస్‌ అశోక్ భూషన్‌లతో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

బ్యాంకులకు రూ.9000 కోట్లు ఎగవేసిన కేసులో విజ‌య్‌మాల్యాను విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించినా హాజరుకాక పోవడం, తన పిల్లల ఖాతాల్లోకి డ‌బ్బులు బదలాయించడంపై.. సుప్రీం ధర్మాసనం జూలై 2017లో కోర్టు ధిక్కారం కింద ఆయనను దోషిగా ప్రకటించింది.

ఆ తీర్పుపై రివ్యూ కోరుతూ మాల్యా వేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన ఓ ప్రత్యుత్తరం కోసం రిజిస్ట్రీని అడిగింది. అయితే కేసు పేపర్ల నుంచి సంబంధిత పత్రాలు కనిపించకపోవడంతో.. తాజా కాపీల కోసం మరికొంత సమయం కావాలని సంబంధిత అధికారులు విన్నవించారు.

2017 నాటి తీర్పుపై మాల్యా పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ.. సుప్రీంకోర్టు జూలై 19న తన రిజిస్ట్రీని ఆదేశించింది. గత మూడేళ్లలో ఈ కేసు నిర్వహణకు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉందో అధికారులతో సహా అన్ని వివరాలను సమర్పించాలని కోరింది.

కోర్టు ముందున్న రికార్డుల‌ ప్రకారం.. ఈ పిటిషన్ గత మూడేళ్లుగా ధర్మాసనం ముందుకు ఎందుకు రాకుండా ఉండిపోయిందనీ.. ఇంత ఆల‌స్యం ఎందుకు జరిగిందో రిజిస్ట్రీ నుంచి వివరణ వచ్చిన తర్వాతే.. కేసులో తదుపరి విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

Next Story
Share it