ఉద్యోగులను 5 సంవత్సరాల వరకూ వేతనం లేని సెలవులో వెళ్లిపొమ్మన్న ఎయిర్ ఇండియా

By సుభాష్  Published on  16 July 2020 2:50 AM GMT
ఉద్యోగులను 5 సంవత్సరాల వరకూ వేతనం లేని సెలవులో వెళ్లిపొమ్మన్న ఎయిర్ ఇండియా

లాక్ డౌన్ ప్రభావం అన్ని సంస్థలపై పడింది. ముఖ్యంగా విమానయాన సంస్థలు సర్వీసులు నడపలేకపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటున్నాయి. భారీగా నష్టాల పాలవ్వడమే కాకుండా దివాళా వైపు అడుగులు వేస్తున్నాయి. ఇంకొన్ని సంస్థల యాజమాన్యాలు మాత్రం సంస్థలను కాపాడుకోడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఎయిర్ ఇండియా కూడా ప్రస్తుతం అదే బాటలో పని చేస్తోంది.

సంస్థలో పని చేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం తాజాగా ఎయిర్ ఇండియా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. నాన్-పెర్ఫార్మింగ్ స్టాఫ్ మెంబర్లను వేతనం లేని లీవుల్లో పంపించాలని భావిస్తోంది. వేతనం లేకుండా ఉద్యోగుల దీర్ఘకాల సెలవు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగులకు ఆరు నెలల నుంచీ రెండేళ్ల వరకూ సెలవులు ఉండనున్నాయి. ఆ సమయాన్ని 5 ఏళ్ల వరకు పొడిగించే వెసులుబాటు కూడా ఉంది. సంస్థ యజామాన్యమే ఉద్యోగులను ఎంపిక చేయనుంది. వయసు, ఆరోగ్యం, సామర్థ్యం, ప్రస్తుతం సంస్థకు ఉన్న అవసరాలు వంటి వాటి ఆధారంగా ఈ ఎంపిక జరగుతుంది.

ఎయిర్ ఇండియా సిఎండి రాజీవ్ బన్సల్ ఉద్యోగులకు ఎటువంటి వేతనం చెల్లించకుండా లీవ్ మీద పంపించే అవకాశం ఉంది. అది ఆరు నెలలా.. రెండు సంవత్సరాలా.. అయిదు సంవత్సరాలా అన్నది తెలియాల్సి ఉంటుంది అని మంగళవారం విడుదలైన అఫీషియల్ ఆర్డర్ లో ఉంది. డిపార్ట్మెంటల్ హెడ్స్, రీజనల్ డైరెక్టర్లు ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయాలు తీసుకోనున్నారు. లిస్టులో ఉన్న ఉద్యోగుల డేటా జనరల్ మేనేజర్ దగ్గరకి చేరుతుంది ఆ తర్వాత సిఎండి అప్రూవల్ పొందుతుంది.

ఈ మధ్యనే క్యాబిన్ క్రూ సిబ్బంది ట్రైనింగ్‌ను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. శిక్షణ తరువాత ఉద్యోగం ఉద్యోగం ఇస్తామన్న ఆఫర్‌నూ వెనక్కు తీసుకుని వారిని తొలగించింది. సంస్థ గడ్డుకాలం ఎదుర్కుంటున్న కారణంగా శిక్షణ కొనసాగించడం కుదరదంటూ వారికి లేఖ రాసింది. ఈ నిర్ణయం 180 మంది ట్రైనీ సిబ్బందిపై ప్రభావం చూపుతోంది.

ప్రభుత్వం ఇప్పటికే ఎయిర్ లైన్స్ ను అమ్మేయాలి అనుకుంటున్న తరుణంలో ఈ విషయం బయటకు వచ్చింది. ఎయిర్ లైన్స్ అమ్మకం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ట్రావెల్ విషయంలో ఎన్నో ఆంక్షలు ఉండడంతో ఏవియేషన్ సెక్టార్ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. భారత్ లోనూ పెద్దగా సర్వీసులు నడపడం లేదు, విదేశాలకు కూడా ఎటువంటి సర్వీసులు లేకపోవడంతో ఎయిర్ లైన్స్ సంస్థలు కాస్ట్ కటింగ్ పై దృష్టి పెట్టాయి. ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడమే కాకుండా.. ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గిస్తూ ఉన్నారు. భారత్ లో మే 25 తర్వాత డొమెస్టిక్ విమాన సర్వీసులు నడపడానికి అనుమతులు ఇచ్చారు. ఇంటర్నేషనల్ సర్వీసులు మార్చి 23 నుండి జులై 31 వరకూ రద్దు చేశారు. త్వరలోనే ఇంటర్నేషనల్ సర్వీసులు మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story