భారత్‌కు ఎంతో రుణపడి ఉన్నాము: ట్రంప్‌

By సుభాష్  Published on  9 April 2020 6:45 AM GMT
భారత్‌కు ఎంతో రుణపడి ఉన్నాము: ట్రంప్‌

ప్రపంచ దేశాలను కరోనా వెంటాడుతోంది. ఇక అమెరికాలో మాత్రం కరోనా విలయతాండవం చేస్తోంది. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. అసాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరమని, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై భారత్‌ తీసుకున్న నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని రోజులుగా మలేరియాకు సంబంధించిన ఈ మందులను విదేశాలకు ఎగుమతి నిషేధం విధించింది భారత్‌. దీంతో అమెరికాకు ఈ మందులను సరఫరా చేయాలని ట్రంప్‌ మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. స్పందించిన భారత ప్రభుత్వం వెంటనే మందులను అమెరికాకు చేరవేసింది. మందుల సరఫరాపై ట్రంప్‌ మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. కరోనా వ్యాప్తిపై మంచి ఫలితాలు ఇస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సరఫరా చేయడం, భారత్‌ చేసిన మేలు ఎన్నటికీ మర్చిపోలేమని, భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వానికి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

కాగా, కరోనాతో అల్లాడుతున్న దేశాలకు అత్యవసర సమమయంలో మానవతా దృక్పథంతో మందులను సరఫరా చేశామని భారత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 29 మిలియన్‌ డోసుల డ్రగ్స్‌ను అమెరికాకు ఎగుమతి చేసింది. ఈ సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ట్రంప్‌.. సమస్యలు తలెత్తిన సమయంలో మా విన్నపాన్ని అర్థం చేసుకుని మందులను సరఫరా చేసిన ప్రధాని మోదీకి రుణపడి ఉంటాము, మోదీ చాలా మంచోడు. ఇలాంటి వ్యక్తిని మేము ఎన్నడూ మర్చిపోలేము అంటూ పేర్కొన్నారు. కాగా, మెడిసిన్‌ను సరఫరా చేయకుంటే ప్రతీకార చర్యలు ఉంటాయని ముందుగా ప్రకటించిన ట్రంప్‌.. అనంతరం స్వరం మర్చారు.

కరోనా వైరస్‌ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 14వేలకు పైగా మృత్యువాత పడ్డారు. లక్షలాదిగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని అమెరికాతో పాటు బ్రెజిల్‌ మరో 30 దేశాలు భారత్‌ను కోరాయి. ఇప్పటికే అమెరికాకు సరఫరా చేసిన భారత్‌.. బ్రెజిల్‌కు కూడా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది‌. దీంతో బ్రెజిల్‌ అధ్యక్షుడు సైతం మోదీకి ధన్యవాదాలు తెలిపారు.



Next Story