అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ పర్యటన కొనసాగుతోంది. ముందు అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ దంపతులకు ప్రధాని నరేంద్రమోదీ ఘన స్వాగతం పలికారు. అనంతరం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలోకి వెళ్లే ముందు ట్రంప్‌, మెలానియా, మోదీ షూ విడిచి లోపలికి వెళ్లారు. ఆశ్రమ నిర్వాహకులు అందించిన పూలమాలను ట్రంప్‌, మోదీ గాంధీ చిత్రపటానికి అలంకరించారు. అనంతరం అక్కడ మహాత్మగాంధీ వాడిన చరకా యంత్రాన్ని తిప్పారు. మెలానియా చరకా యంత్రాన్ని తిప్పుతుంటే ట్రంప్‌ ఆ యంత్రాన్ని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

ట్రంప్‌ లైఫ్‌ను గమనించిన వారికి ఇదొక ఆశ్చర్యకరమైన విషయమేనని చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ట్రంప్‌ నేలపై కూర్చోరు. అలాంటి సందర్భాలు చూసిన దాఖలాలు కూడా లేవు. ట్రంప్‌ ఆదేశాలు ఇవ్వడమే తరువాయి వెంటనే సోఫాలు, కుర్చీలు ఇట్టే వాలిపోతాయి. కానీ సబర్మతి ఆశ్రమంలో ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా మోదీతో కలిసి నేలపై కూర్చోవడం విశేషం. ట్రంప్‌ ఇలా నేలపై కూర్చోవడం అక్కడున్న వారందరికి ఆశ్చర్యం కలిగించింది. అనంతరం ట్రంప్‌ దంపతులు సబర్మతి ఆశ్రమంలో కలిగిన అనుభూతిని విజిటర్స్‌ బుక్‌లో వివరిస్తూ భారత్‌ను సందర్శించడం గొప్ప అనుభూతి  అంటూ సంతకాలు చేశారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.