ఓటమి భయంతోనే ట్రంప్ అంతలా నోరు పారేసుకుంటున్నారా?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Aug 2020 4:57 PM IST
ఓటమి భయంతోనే ట్రంప్ అంతలా నోరు పారేసుకుంటున్నారా?

నచ్చినోళ్లను ఆకాశానికి ఎత్తేయటం.. నచ్చనోళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసే తీరుతో వ్యవహరించే అలవాటున్న నేతలు తెలుగు నేల మీద చాలామందే కనిపిస్తారు. కాబట్టి.. ఈ తరహా రాజకీయ నేతల తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వారికి మించినట్లుగా వ్యవహరిస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. తీవ్రమైన ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

దీనికి తగ్గట్లే ట్రంప్ నోటి దూకుడు ఈ మధ్యన ఎక్కువైంది. ఎప్పుడైతే భారత సంతతికి చెందిన కమలా హరీస్ ను ఉపాధ్యక్ష ఎన్నికకు బరిలో దింపుతున్నట్లుగా ప్రకటన వచ్చిన తర్వాత నుంచి ఆయనలో అసహనం పాళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఆయన కమలా హ్యారీస్ అర్హతను ప్రకటించటమే కాదు.. జాత్యాంహకార వ్యాఖ్యలు చేసేందుకు సైతం వెనుకాడలేదు.

ఆమె ఒక నల్లజాతి మహిళ. తల్లిదండ్రులు ఇక్కడకు వలస వచ్చారు. నేను విన్నది ఏమంటే.. ఆమె ఇక్కడ జన్మించలేదు. అలాంటి వ్యక్తి అమెరికాకు ఉపాధ్యక్షురాలిగా పనికి రారు. వైట్ హౌస్ అవసరాల్ని తీర్చటానికి ఆమె అర్హురాలుకాదు అంటూ జాత్యాంహకార వ్యాఖ్యలకు దిగారు. ఉపాధ్యక్ష పదవికి ఆమెకు అర్హత లేదన్న ఆయన తీరు చూస్తే.. తప్పుడు సమాచారంతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం.. భావోద్వేగానికి గురి చేసే కొత్త ఎత్తుగడకు తెర తీసినట్లుగా చెప్పాలి.

ఇలాంటి తీరుతోనే ఆయన రాజకీయాల్లో ఎదిగారని గుర్తు చేస్తున్న విశ్లేషనకులు.. కమలా హ్యారీస్ పై రానున్న రోజుల్లో మరిన్ని

ఘాటైన విమర్శలు చేయటానికి వెనుకాడరని పేర్కొంటున్నారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలపై ఆన్ లైన్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఉపాధ్యక్షురాలి పదవికి ఆమె సరిగ్గా సరిపోతుందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కమలా హ్యారీస్ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ లో జన్మించారని.. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కావటానికి అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని చెబుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై పలువురు మండి పడుతున్నారు. ‘‘ఇక్కడ రంగు.. తల్లిదండ్రుల గురించి వ్యాఖ్యలు అనవసరం. పైగా అవి పూర్తిగా జాత్యంహకార వ్యాఖ్యలు’’ అంటూ లయోలా లా స్కూల్ ప్రొఫెసర్ జెస్సికా పేర్కొన్నారు.

గతంలోనే ఒబామా విషయంలోనూ ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఆయన.. తర్వాత అప్పుడేదో అయిపోయిందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కమలా హ్యారీస్ విషయంలోనూ అలాంటి తీరునే ప్రదర్శించటం గమనార్హం. కమలా మీద అంతలా ట్రంప్ విరుచుకుపడుతున్నారంటే.. ఆ స్థాయిలో ఆమె అభ్యర్థిత్వం ఆయన్ను ఇబ్బంది పెడుతుందనేగా?

Next Story