పీపీఈ కిట్ ధరించి ఆ నాయ‌కుడు‌ చేసిన పనికి ప్ర‌శంస‌ల వెల్లువ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 11:24 AM GMT
పీపీఈ కిట్ ధరించి ఆ నాయ‌కుడు‌ చేసిన పనికి ప్ర‌శంస‌ల వెల్లువ

కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరికైనా సోకవచ్చు.. కానీ కరోనా సోకిన కుటుంబాలు చాలా చోట్ల వివక్ష ఎదుర్కొంటూ ఉన్నాయి. కరోనా నుండి కోలుకున్న తర్వాత కూడా వారిని పక్కన పెట్టడం ఎన్నో ఊళ్ళలో చోటుచేసుకుంది. ఇక కరోనా లక్షణాలు ఉన్న వారిని కనీసం తాకడానికి కూడా భయపడుతూ ఉన్నారు ప్రజలు. మానవత్వంతో కనీసం స్పందించకపోతే ఏదైనా దారుణం కూడా చోటు చేసుకోవచ్చు.

అలాంటి ఓ ఘటన చోటుచేసుకోకుండా ఓ నేత చాలా గొప్ప పని చేశాడు. పీపీఈ కిట్ ధరించి కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తిని తన బైక్ మీద తీసుకుని వెళ్లిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జార్ గ్రామ్ జిల్లా సిజు గ్రామానికి చెందిన అమల్ బారిక్ అనే వ్యక్తి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. పల్లెటూరు కావడంతో అతడికి కరోనా అని భావించి ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు ఆంబులెన్స్ కూడా రాలేదు.

ఈ విషయం గోపీబల్లబ్‌పూర్ గ్రామానికి చెందిన సత్యకామ్ పట్నాయక్ కు తెలిసింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈయన అమల్ బారిక్ కు సహాయం చేయాలని అనుకున్నారు. వెంటనే తెలిసిన వారి వద్ద ఓ బైక్ అడిగి తీసుకుని మెడికల్ షాపునకు వెళ్లి అక్కడ పీపీఈ కిట్ కొనుగోలు చేశాడు. తెలుపు రంగు పీపీఈ కిట్ ధరించి అమల్ బారిక్ నివాసానికి వెళ్లాడు. అతడిని బండి మీద ఎక్కించుకుని 3 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చాడు. ఆయన చేసిన మంచి పనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. సత్యకామ్ పట్నాయక్ లాంటి నాయకుడు రాజకీయాల్లో ఉండాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉన్నారు.

సత్యకామ్ పట్నాయక్ గోపిబల్లవపూర్ బ్లాక్ వన్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ లీడర్ గా ఉన్నారు. తృణమూల్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్థాపించిన యువ వారియర్ క్లబ్ లో కూడా సభ్యుడు.

Next Story