బెంగళూరులో గుడి మీద ఎవరూ దాడి చేయకుండా అడ్డుగా నిలబడిన ముస్లిం యువత

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Aug 2020 9:25 AM GMT
బెంగళూరులో గుడి మీద ఎవరూ దాడి చేయకుండా అడ్డుగా నిలబడిన ముస్లిం యువత

మొహమ్మద్ ప్రవక్త మీద అసభ్యకరమైన కామెంట్లు చేశారన్న ఆగ్రహంతో రెండు రోజుల కిందట బెంగళూరులో పెద్ద విధ్వంసం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు నవీన్‌ ఫేస్‌బుక్‌లో రెచ్చగొట్టే విధంగా ఓ కమ్యూనల్‌ పోస్టు షేర్‌ చేయడంతో ఈ గొడవ మొదలైంది. మంగళవారం రాత్రి బెంగళూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ ఘర్షణల్లో దాదాపు 3000 మంది పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.

డిజె హళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో రోడ్డు మీద ఉన్న వాహనాలను కూడా తగులబెట్టడం జరిగింది. అక్కడే ఉన్న దేవాలయానికి ఏమీ అవ్వకుండా ముస్లిం యువకులు అడ్డుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. ముస్లిం యువకులు ఒకరి చేయిని మరొకరు పట్టుకుని గుడి ముందు నిలబడిన వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఆ ప్రాంతంలో కొందరు ఆందోళనకారులు ప్రభుత్వ ప్రైవేట్ ఆస్థులను నాశనం చేస్తున్న సమయంలో ముస్లిం యువకులు గుడికి ఏమీ జరగకుండా అడ్డుపడ్డారు. ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. హిందూ ఆలయాన్ని కూల్చకుండా ఆ మందిరం చుట్టూ మానవహారంగా నిలబడి అడ్డుకున్నారు. అంతటి ఉద్రిక్తతల మధ్య కూడా ఆ ముస్లిం యువకులు భారతీయ భిన్నత్వంలోని ఏకత్వ విలువను చాటడం పట్ల సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి. ఒక కమ్యూనిటీలోని కొందరు చేసిన పని కారణంగా ఆ మొత్తం కమ్యూనిటీని నిందించడం సరికాదని అన్నారు కాంగ్రెస్ నేత శశిథరూర్.

బెంగళూరులోని డీజేహళ్లి, కేజీహళ్లి పోలీస్‌ స్టేషన్ల పరిధిలో హింసాత్మక ఘటన వెనుక భారీ ప్రణాళిక ఉందని పోలీసులు చెబుతున్నారు.ఆగష్టు 5 నుంచి కుట్రకు ప్రణాళిక వేశారని పోలీసులు తెలిపారు. అల్లర్ల వెనుక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హస్తం ఉందని చెబుతున్న పోలీసులు.. ఎస్‌డీపీఐ నేత ముజామ్మిల్‌ బాషాను ఏ1గా చెబుతున్నారు. ఆందోళన కారులను గుర్తించే పనిలో పడ్డ పోలీసులు.. జరిగిన నష్టాన్ని ఆందోళ కారుల నుండే వసూలు చేయాలని భావిస్తూ ఉన్నారు.

బెంగ‌ళూరులో హింసాకాండ కు పాల్ప‌డ్డ ఆందోళ‌న కారుల వ‌ద్ద నుంచి న‌ష్ట‌ప‌రిహారం వ‌సూలు చేస్తామ‌ని మంత్రి సీటీ ర‌వి హెచ్చ‌రించారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టంపై ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లో ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగాయ‌ని, ఆ ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణ‌మైన ఆందోళ‌న కారుల వ‌ద్ద నుంచి ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రిహారం వ‌సూలు చేసింద‌ని, అదే త‌ర‌హాలో ఇక్క‌డ వ‌సూలు చేస్తామ‌ని అన్నారు.

Next Story