బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టిన రాయపాటి కంపెనీ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 31 Dec 2019 3:45 PM ISTముఖ్యాంశాలు
- బయపడ్డ ట్రాన్స్ స్ట్రోయ్ స్కామ్ కథాకమామీషు
- జాతీయ బ్యాంకులకు రూ.8,832 కోట్ల ఋణం ఎగవేత
- 15 జాతీయ బ్యాంకుల్లో ఋణాలు తీసుకున్న కంపెనీ
- ఎం.డి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో అవకతవకలు
- పోలవరం ఇందిరాసాగర్ ప్రాజెక్టును పోగొట్టుకున్న కంపెనీ
- అర్థంతరంగా ఆగిన జాతీయ రహదారుల నిర్మాణం కాంట్రాక్టులు
- జాదర్ పూర్ హైవే ప్రాజెక్ట్ తప్ప మిగిలిన ప్రాజెక్టులు కుదేలు
- తీసుకున్న ఋణాలను దారి మళ్లించినట్టు అభియోగాలు
- ట్రాన్స్ స్ట్రోయ్ పై ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసిన సి.బి.ఐ
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ స్ట్రోయ్ కంపెనీ చేసిన స్కామ్ లొసుగులు ఒక్కొక్కటిగా పూర్తి స్థాయిలో బయటపడుతున్నాయి. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం ఈ సంస్థ 15 జాతీయ బ్యాంకుల్లో తీసుకున్న రూ. 8.832 కోట్ల రూపాయల ఋణాన్ని ఎగ్గొట్టినట్టు అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇలా ఈ సంస్థ తీసుకున్న అప్పును ఎగ్గొట్టిన బ్యాంకుల్లో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకూడా ఉన్నాయి.
ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీ చేసిన బ్యాంక్ లోన్ ఫ్రాడ్ హిస్టరీని బైటికి లాగిన సిబిఐ ఆ సంస్థపై కేసులు నమోదు చేసింది. సిబిఐ అధికారులు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావ్ కి చెందిన ఈ కంపెనీ చేసిన మోసాలకు సంబంధించిన పూర్తి కూపీని లాగుతున్నారిప్పుడు. చెరుకూరి శ్రీధర్ రావ్ ఈ కంపెనీకి మ్యానేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు.
ఈ కంపెనీ ఇందిరాసాగర్ పోలవరం లాంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులను పెద్ద ఎత్తున డీల్ చేస్తుంది. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును ఈ సంస్థ రూ.5,788 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ప్రారంభించింది. చేపట్టిన పనులు 31 శాతం పూర్తయ్యాయని కంపెనీ అధికారిక పత్రాల్లో చెప్పుకుంది. ఒక్క జాదల్ పూర్ జాతీయ రహదారి ప్రాజెక్ట్ తప్ప ట్రాన్స్ స్ట్రోయ్ చేపట్టిన మిగతా ప్రాజెక్టులన్నీ అర్థంతరంగా ఆగిపోయాయి, మూలపడ్డాయి. ఈ సంస్థ పోలవరం కాంట్రాక్ట్ నుకూడా పోగొట్టుకుంది.
కెనరా బ్యాంక్ ఈ సంస్థకు ఫండ్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.600 కోట్ల రూపాయల్ని, నాన్ ఫండ్ బేస్డ్ వర్కింగ్ క్యాపిటల్ కింద రూ.725 కోట్ల రూపాయల్ని అంటే మొత్తం రూ.125 కోట్ల రూపాయల్ని ఋణంగా ఇచ్చింది. ఇందుకోసం ట్రాన్స్ స్ట్రోయ్ కదిలించడానికి వీల్లేని 33 ఆస్తుల్ని బ్యాంకుకు గ్యారంటీకింద కుదువపెట్టింది.
ఈ సంస్థ చైనాలోని బీజింగ్ లో 400 మిలియన్ యు.ఎస్ డాలర్ల ఈక్విటీ కమ్ డెట్ ప్రాజెక్ట్ ను తీసుకుని 2016లో షేర్ హోల్డింగ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేసింది. దీనిలో ఈ సంస్థ పెట్టిన పెట్టుబడి 2019 మార్చ్ నాటికి 169 మిలియన్ డాలర్లు.
ఇందుకోసం బ్యాంకులు అంగీకార పత్రాలను ఇవ్వలేదని ఈ సంస్థ చెబుతోంది. ప్రాథమికంగా ఇచ్చిన ఋణాన్ని రాబట్టుకునేందుకు బ్యాంకులు హైదరాబాద్ లోని డెట్ రికవరీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించాయి. సెక్యూరిటీ ఇంట్రస్ట్ చట్టం కింద కుదువపెట్టిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు అనుమతి కోరాయి.
ఈ సంస్థపై వివిధ బ్యాంకులు మొత్తం 8 కేసులు పెట్టాయి. 2018లో కెనరా బ్యాంక్ ఎన్.సి.ఎస్.టికి 2015 మే 30వ తేదీన సంస్థకు చెందిన లోన్ అకౌంట్ ఎన్.పి.ఎ అయ్యిందని పిటిషన్ పెట్టుకుంది. కేవలం ఒక్క కెనరా బ్యాంకుకే ట్రాన్స్ స్ట్రోయ్ రూ.990 కోట్ల రూపాయలను ఎగ్గొట్టిందని రిజల్యూషన్ ప్రొఫెషనల్ జి.వి.నరసింహారావు చెబుతున్నారు. మిగిలిన అన్ని బ్యాంకులకూ కలిపి ఈ సంస్థ రూ.7,842 కోట్ల రూపాయల తీసుకన్న ఋణాన్ని ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది.
జి.వి.నరసింహారావు ఎన్.సి.ఎల్.టికి సమర్పించిన పిటిషన్ లో 2014నుంచే కంపెనీ ఎం.డి చెరుకు శ్రీధర్ రావు చేసిన లావాదేవీల్లో అవకతవకలు మొదలయ్యాయని పేర్కొన్నారు. నేషనల్ హైవేస్ అధారిటీ అంచనా వ్యయాన్ని పెంచకపోవడంవల్ల, వర్కింగ్ క్యాపిటల్ కొరవడడంవల్ల వర్కింగ్ క్యాపిటల్ లేక కంపెనీ దివాలా తీసిందని ట్రాన్స్ స్ట్రోయ్ ఎన్.సి.ఎల్.టికి ఇచ్చిన సమాధానంలో పేర్కనడం గమనార్హం. కంపెనీ బ్యాంకులనుంచి తీసుకున్న ఋణాలను పూర్తి స్థాయిలో మళ్లించిన విషయం ఫోరెన్సిక్ ఆడిట్ లో బయటపడిందని సి.బి.ఐ ఎఫ్.ఐ.ఆర్ లో పేర్కొంది.