ప్రాజెక్టుల వార్‌పై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది
By Knakam Karthik
ప్రాజెక్టుల వార్‌పై కేంద్ర ప్రభుత్వం సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ
కేంద్ర ప్రభుత్వం సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపై కేంద్రజలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. మొత్తం పది అంశాలతో కూడిన అజెండాను జలశక్తి శాఖ సిద్ధం చేసింది. అందులో తెలంగాణ ప్రభుత్వం 9 అంశాలు, ఏపీ ప్రభుత్వం ఏకైక అజెండాగా ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అంశాలు ఉన్నాయి.
ప్రస్తుత దశలో పోలవరం-బనకచర్లపై చర్చ అసంబద్ధమంటూ కేంద్ర జలశక్తి కార్యదర్శికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీ. రామకృష్ణా రావు తాజాగా లేఖ రాసినప్పటికీ, పోలవరం-బనకచర్ల అనుసంధానమే అజెండాలో మొదటి అంశంగా పెట్టారు. ఆ తర్వాతనే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన 9 అంశాలున్నాయి. బనకచర్లపై చర్చించేదే లేదని ఇప్పటికే కేంద్రానికి స్పష్టం చేస్తూ రాష్ట్రప్రభుత్వం ఓ లేఖను రాసింది. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, ఆర్థిక సాయంపై చర్చించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యమంత్రుల సమావేశం అజెండాలో తెలంగాణ తరఫున శ్రీశైలం జలాశయంలో వివిధ స్థాయిల ఎత్తు నుంచి నీటిని ఇతర బేసిన్లకు మళ్లించకుండా ఆపడం, కృష్ణా ట్రైబ్యునల్ 2 వద్ద తెలంగాణ వాదనలకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన తెలంగాణ ప్రాంతంలోని ప్రాజెక్టులకు నీటిని వినియోగించుకునేలా ఆంధ్రప్రదేశ్‌ను ఒప్పించడం వంటి తదితర అంశాలున్నాయి. తుంగభద్ర జలాల మళ్లింపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్తర్వులకు కట్టుబడి ఉండేలా ఏపీని ఒప్పించడం, శ్రీశైలం కుడిగట్టు కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచకుండా వ్యవహరించడం, శ్రీశైలం నుంచి నీటిని మళ్లిస్తున్న హంద్రీ-నీవా, గురురాఘవేంద్ర, ముచ్చుమర్రి, వెలిగొండ పథకాల నిర్మాణం, విస్తరణలు వద్దని తెలంగాణ ప్రభుత్వ స్పష్టంగా ప్రతిపాదించింది.