ఢిల్లీకి గవర్నర్ - రేపు అమిత్ షా తో కీలక భేటి
By - Nellutla Kavitha | Published on 4 April 2022 3:03 PM GMTతెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సతీసమేతంగా రాజధానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవైపు ముఖ్యమంత్రి, మరొకవైపు గవర్నర్ ఇద్దరు ఢిల్లీకి వెళ్లడం ఆక్తికరంగా మారింది. రేపు గవర్నర్ తమిళిసై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని తెలుస్తోంది.
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలపై గవర్నర్, హోం శాఖకు ఇచ్చే రిపోర్ట్ కీలకంగా మారబోతోంది. మరోవైపు హోం మంత్రి అమిత్ షా తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నట్టుగా సమాచారం ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్కు, గవర్నర్ తమిళిసై కు మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరు ఢిల్లీకి పోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి గవర్నర్గా తమిలిసై వచ్చిన తరవాత మొదట్లో కొంత మంచి వాతావరణం ఉన్నప్పటికీ తర్వాత మాత్రం దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం నుంచి, ఇటీవల జరిగిన పలు పరిణామాలు రాజ్ భవన్ కు, ప్రగతి భవన్ కు మధ్య గ్యాప్ ను స్పష్టంగా బయటపెడుతున్నాయి. దీంతో పాటుగా, ప్రోటోకాల్ వివాదాలు ఉండనే ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లిన గవర్నర్ కు మంత్రులు స్వాగతం పలక లేదు. ఇక ఈ ఏడాది జరిగిన గణతంత్ర వేడుకలకు సైతం సీఎం కేసీఆర్ సహా మంత్రులు ఎవరు హాజరు కాలేదు. వేడుకలను కూడా రాజ్భవన్కు మాత్రమే పరిమితం చేశారు.
ఇటీవలే పునఃప్రారంభమైన యాదాద్రి లో కూడా గవర్నర్ దంపతులకు ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే సహా ఆలయ ఈవో కూడా స్వాగతం పలుకలేదు. ఇక రాజ్ భవన్ లో నిర్వహించిన ఉగాది వేడుకల్లో తనకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ పై ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్. సీయం కేసీఆర్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలను ఉగాది ఉత్సవాలకు ఆహ్వానించినా ఎవరూ హాజరు కాలేదని తమిలిసై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ లో నిర్వహించే ఉగాది ఉత్సవాలకు తనను ఆహ్వానిస్తే ప్రోటోకాల్ ని పక్కన పెట్టి మరీ హాజరవుతానని చెప్పారు గవర్నర్. కానీ ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు గవర్నర్కు ఆహ్వానం అందలేదు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మంచి ఊపుమీదున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. తమ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా వ్యవహరిస్తున్న తమిళిసై సౌందరరాజన్ కేంద్ర హోంశాఖ నుంచి పిలుపు రావడంతో ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు అమిత్ షాతో భేటీ అవుతున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరి రాజ్ నివాస్ లో అధికారిక పనులతో బిజీగా ఉన్నా, తమిళిసై అటు నుంచి అటే ఢిల్లీకి పయనం అవుతున్నట్టు సమాచారం.
మరోవైపు ఢిల్లీలో ఉన్న సీఎం కేసీఆర్ ఎన్ని రోజులు అక్కడ ఉంటారు, ఎవరెవరిని కలుస్తారు అనేది ఇప్పటికీ స్పష్టత లేదు. రైతుల కోసం ఉగాది తర్వాత ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని ప్రకటించిన కేసీఆర్, ఈనెల 11న ధర్నా చేస్తామని కూడా ప్రకటించారు. మరి కేసీఆర్ ఈ నెల 11 వరకూ ఢిల్లీలోనే ఉంటారా? బిజెపి, కాంగ్రెసేతర పార్టీల నేతలను కలుస్తారా? లేకుంటే రైతు నాయకులతో చర్చిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా, ఒకవైపు ముఖ్యమంత్రి, మరొకవైపు గవర్నర్ ఢిల్లీకి వెళ్లడంపై ఆసక్తికరంగా మారింది. ఏం జరగబోతోంది అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.