పోలవరం–నల్లమల్ల సాగర్‌పై విచారణ సోమవారానికి వాయిదా
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
By - Knakam Karthik |
పోలవరం–నల్లమల్ల సాగర్‌పై విచారణ సోమవారానికి వాయిదా
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తరఫు సీనియర్ న్యాయవాదులు తీవ్ర వాదనలు వినిపించారు.
తెలంగాణ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ, పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న కాలువల నిర్మాణం వల్ల వరద నీటిపై తెలంగాణకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర జల సంఘం (CWC) ఇప్పటికే నీటి మళ్లింపును నిలిపివేయాలని సూచించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ఇది అత్యవసర పరిస్థితి కావడంతోనే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
దీనిపై స్పందించిన సీజేఐ, పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టు అని, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ మార్పులు లేదా మళ్లింపులు చేయలేరని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ముందుగా ఆ కమిటీ ముందు అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు. అలాగే, ఇలాంటి అంతర్‌రాష్ట్ర జల వివాదాల విషయంలో ఆర్టికల్ 131 ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయడమే సరైన మార్గమని వ్యాఖ్యానించారు.
సింఘ్వీ స్పందిస్తూ, కమిటీ ముందు స్టే ఇవ్వమని కోరే అధికారం లేదని, తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వగలిగేది కేవలం సుప్రీంకోర్టే అని తెలిపారు. ప్రస్తుతం పనులు కొనసాగితే ‘ఎక్విటీస్’ ఏర్పడి, భవిష్యత్తులో వాటిని రద్దు చేయడం అసాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దశలో ధర్మాసనం, కమిటీ చురుకుగా పనిచేస్తోందని, అవసరమైతే అదే జోక్యం చేసుకుంటుందని పేర్కొంది. అయితే పిటిషన్ నిర్వహణార్హత (maintainability) పైనే తమ ప్రధాన సందేహమని సీజేఐ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ వాదిస్తూ, పోలవరం ప్రాజెక్టు నివేదికలను అన్ని రాష్ట్రాలు పరిశీలించిన తర్వాతే డీపీఆర్ (Detailed Project Report) కు ఆమోదం లభిస్తుందని తెలిపారు. తెలంగాణ అభ్యంతరాలు అప్రయోజనకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇంకో వైపు, సీనియర్ అడ్వకేట్ జైదీప్ గుప్తా ఈ పిటిషన్ దురుద్దేశపూరితమని (mala fide) ఆరోపించారు. కేంద్రంతో సంబంధం ఉన్న అంశాన్ని నేరుగా సుప్రీంకోర్టుకు తీసుకువచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచే పోలవరం ప్రాజెక్టు ఉందని గుర్తు చేశారు. వాదనల అనంతరం, ధర్మాసనం రెండు పక్షాల వాదనలు పూర్తిగా వింటామని తెలిపి, ఈ వ్యవహారాన్ని సోమవారం మళ్లీ విచారిస్తామని ప్రకటించింది. ఇరు పక్షాలు ఒక ఆచరణాత్మక పరిష్కారంతో ముందుకు రావాలని సీజేఐ ఆకాంక్ష వ్యక్తం చేశారు.