కేటీఆర్‌కు షాక్, మరో కేసు నమోదు చేసిన పోలీసులు

ఫార్ములా ఈ-కార్ రేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది.

By Knakam Karthik  Published on  11 Jan 2025 7:42 AM IST
TELANAGANA POLICE, BRS, CONGRESS, KTR, CM REVANTH, FIR ON KTR, POLITICS

కేటీఆర్‌కు షాక్, మరో కేసు నమోదు చేసిన పోలీసులు

ఫార్ములా ఈ-కార్ రేసులో విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో షాక్ తగిలింది. పోలీసుల ఆదేశాలను పాటించలేదంటూ ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. పోలీసుల ఆదేశాలను పాటించకుండా ర్యాలీ నిర్వహించారని ఫిర్యాదు రావడంతో కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఓ వైపు ఫార్ములా ఈ కార్ రేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు హాజరైన కేటీఆర్, విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం నుంచి తెలంగాణ భవన్ వరకు పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ తీశారని ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అనధికారికంగా ర్యాలీ నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ట్రాఫిక్ పోలీసులు తమ ఫిర్యాదులో తెలిపారు.

అయితే ఫార్ములా ఈ కార్ కేసులో ఏసీబీ అధికారులు ఈ నెల 9న ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను విచారించారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న డీఎస్పీ మజీద్ ఖాన్ కేటీఆర్‌ను విచారించారు. కాగా విచారణను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షించారు. కేటీఆర్ విచారణ ప్రక్రియను చూసేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో, కేటీఆర్ లాయర్‌ రామచంద్రరావుకు వేరే గది నుంచి చూసేందుకు అనుమతించారు. విచారణ పూర్తయిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకుని ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఇక్కడ మీడియా సమావేశం పెట్టవద్దని సూచించారు. దీంతో అక్కడ నుంచి ర్యాలీగా తెలంగాణ భవన్‌కు కేటీఆర్ వెళ్లారు. పోలీసుల పర్మిషన్ లేకుండా ర్యాలీ తీశారని కేసు నమోదు చేశారు.

Next Story