తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే - ప్రధాని మోది

By -  Nellutla Kavitha |  Published on  26 May 2022 8:20 AM GMT
తెలంగాణలో అధికారంలోకి వచ్చేది మేమే - ప్రధాని మోది

ఐఎస్బి ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ కి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బేగంపేట విమానాశ్రయంలో కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. దీంతోపాటుగా కెసిఆర్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ప్రధాని. తెలంగాణను విచ్ఛిన్నం చేసే వాళ్ళు నాడు-నేడు ఉన్నారని, ఒక కుటుంబ పాలన కోసం తెలంగాణ ఏర్పడలేదని వ్యాఖ్యానించారు మోదీ. తెలంగాణలో ప్రభుత్వ మార్పు తథ్యమని, బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరవీరుల చేసిన త్యాగాలు ఒక కుటుంబం కోసం కాదని అన్నారు ప్రధాని. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలు మరో పేరని, తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నా అన్నారు మోడీ. మొదటగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ, రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా యువత పోరాడాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, తమ పోరాటం అభివృద్ధి కోసమే అని అన్నారు ప్రధాని. తెలంగాణ ప్రజలందరికీ తన నమస్కారాలు చెబుతూ వాళ్ళ అభిమానమే తన బలం అంటూ, ఇక్కడికి ఎప్పుడొచ్చినా వారి రుణం పెరిగిపోతుందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీ.

తెలంగాణలో ఒక కుటుంబం అభివృద్ధిని అణిచివేయాలని చూస్తోందని, యువతతో కలిసి బిజెపి తెలంగాణ అభివృద్ధిని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ. తమ పోరాటం ఫలితాన్నిస్తుందని, తెలంగాణలో మార్పు తథ్యమని, కేంద్ర పథకాలు తెలంగాణ ప్రజలకు అందడం లేదని, ప్రజల మనసు నుంచి తమ పేర్లను చెరిపి వేయలేరు అని వ్యాఖ్యానించారు ప్రధాని.

Next Story